ICC Rankings:  టీమిండియా ముందు అద్భుత అవకాశం. చరిత్ర సృష్టించడానికి భారత క్రికెట్ జట్టు ఇంకో 2 సిరీస్ ల దూరంలో ఉంది. అవును క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 కావడానికి భారత్ కు అవకాశం వచ్చింది. టీ20ల్లో భారత్ ఇప్పటికే నెంబర్ 1 ర్యాంకులో ఉంది. వన్డేల్లో 4వ ర్యాంకు, టెస్టుల్లో రెండో ర్యాంకులో కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ టెస్ట్ సిరీస్ లు... ఈ రెండు ఫార్మాట్లలోనూ టీమిండియా నెంబర్ 1 ర్యాంకు సాధించడానికి దోహదపడతాయి. 


వన్డేల్లో భారత్ అగ్రస్థానానికి చేరేదెలా!


ప్రస్తుతం వన్డేల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. శ్రీలంకతో మూడో వన్డేలో గెలిస్తే జట్టు పాయింట్లు 110కి చేరుకుంటాయి. వచ్చే న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే 114 పాయింట్లతో టీమిండియా నెంబర్ 1 ర్యాంకుకు చేరుకుంటుంది. అయితే అది అంత తేలికేమీ కాదు. ఇటీవల కివీస్ పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ను గెలుచుకుంది. ప్రస్తుతం వన్డేల్లో కివీస్ అగ్రస్థానంలో ఉంది. 2, 3, 4 స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్ లు ఉన్నాయి. 


టెస్టుల్లో భారత్ అగ్రస్థానానికి దారిది


టెస్టుల్లో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ భారత్ కన్నా కేవలం ఒక పాయింట్ మాత్రమే ఎక్కువగా ఉంది. వచ్చే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆసీస్ తో సిరీస్ ను ఎంత తేడాతో గెలుచుకున్నా నెంబర్ 1 స్థానానికి చేరవచ్చు. 



  • ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా పాయింట్లు 116.

  • రెండో స్థానంలో ఉన్న భారత్ పాయింట్లు 115.

  • 4 మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 1-0, 2-0, 2-1, 3-1 ఇలా ఏ తేడాతో అయినా ఓడించినా నెంబర్ 1 ర్యాంకుకు చేరుకుంటుంది. 

  • ఒకవేళ 1-1తో సిరీస్ డ్రా అయితే ఆసీస్ అగ్రస్థానంలో ఉంటుంది. 


టీ20ల్లో నెంబర్ వన్


ప్రసుత్తం టీమిండియా టీ20ల్లో నెంబర్ 1 ర్యాంక్ లో ఉంది. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ ను గెలుచుకుంటే తన అగ్రస్థానాన్ని మరింత మెరుగుపరచుకుంటుంది. ఒకవేళ 1-2తో కివీస్ చేతిలో ఓడిపోతే నెంబర్ 1 ర్యాంకును కోల్పోతుంది.