Rohit- Virat:  ఈ జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది. టీమిండియా కివీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. దీనికోసం శుక్రవారం బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్. వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే టీ20 స్క్వాడ్ లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కలేదు. దీన్ని బట్టి వీరిద్దరూ ఇంకా భవిష్యతుల్లో పొట్టి ఫార్మాట్ లో కనిపించరనే వార్తలు వస్తున్నాయి.


టీ20 జట్టులో నో ప్లేస్


న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు నిన్న బీసీసీఐ ప్రకటించిన జట్టులో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కలేదు. పూర్తిగా యువకులతో కూడిన టీంను బీసీసీఐ సెలక్ట్ చేసింది. ఇంతకుముందు శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్ కు వీరిద్దరినీ ఎంపికచేయలేదు. దీన్ని బట్టి సెలక్టర్ల ఉద్దేశమేంటో స్పష్టమవుతోంది. ఇక రోహిత్, కోహ్లీలకు పొట్టి ఫార్మాట్లో చోటు దక్కడం కష్టమేనని అర్ధమవుతోంది. 


2024 టీ20 ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కుర్రాళ్లకు పెద్దపీట వేస్తోంది. అప్పటికి జట్టును బలంగా నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. అందుకు తగ్గట్లే పొట్టి ఫార్మాట్ లో యువ ఆటగాళ్లకు స్థానం కల్పిస్తోంది. హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించింది. గిల్, ఇషాన్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్లకు వరుసగా అవకాశాలిస్తోంది. ప్రస్తుతం రోహిత్ వయసు 35. కోహ్లీకి 34. దీన్ని బట్టి వయసు రీత్యా వీరిద్దరూ 2024 టీం మెగా టోర్నీ ఆడడం కష్టమే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ద్వయాన్ని టీ20ల్లోకి బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవడంలేదు. 


శాశ్వత నిష్క్రమణ ఖాయమే!


దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. 'భారత టీ20 జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నిష్క్రమణ శాశ్వతం' అని ఆ అధికారి ఒక వార్తా సంస్థతో చెప్పినట్లు సమాచారం. రోహిత్, కోహ్లీలను భవిష్యత్తులో టీ20ల కోసం పరిగణిస్తారా అన్న ప్రశ్నకు ఆ అధికారి ఇలా చెప్పారు. 'మేం వారి భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాం. అది సెలక్టర్ల చేతిలో ఉంది. వారు భారత క్రికెట్ కు మేలు చేసే జట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. అయితే భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతమైతే వారు లేకుండానే మేం ముందుకు సాగుతున్నాం. అలాగే వారి భవిష్యత్ గురించి మాతో చర్చించడానికి మేం ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటాం.' అని ఆ అధికారి తెలిపారు. 


గత 2, 3 టీ20 సిరీస్ ల నుంచి జట్టులో సీనియర్లకు చోటు దక్కడంలేదు. దీన్నిబట్టి రోహిత్, కోహ్లీ, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్ ల టీ20 కెరీర్ దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. 


న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం టీమిండియా జట్టు


హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్.