ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి అగ్రస్థానానికి చేరిన పాకిస్తాన్ ఆనందం 48 గంటల్లోనే ఆవిరైంది. నిత్యం మారుతూ ఉండే ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటిసారి అగ్రస్థానాన్ని చేరుకున్నందుకు గాను నానా రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆ జట్టు నెంబర్ వన్ హోదా 48 గంటల ముచ్చటే అయింది.
ఐసీసీ రెండ్రోజుల క్రితం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ 113 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. 2005లో ఐసీసీ ర్యాంకింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఆ జట్టు టాప్-1 పొజిషన్‌కు చేరుకోవడం ఇదే ప్రథమం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగో వన్డే గెలిచిన తర్వాత బాబర్ ఆజమ్ అండ్ కో.కు ఈ ఘనత దక్కింది. అయితే ఈ ఆనందం రెండ్రోజులకే ఆవిరైంది.
ఓటమితో అంతా రివర్స్..
న్యూజిలాండ్‌తో కరాచీ వేదికగా ముగిసిన ఐదో వన్డేలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్.. 49.3 ఓవర్లలో 299 పరుగులకు ఆలౌట్ అయింది. 300 టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 461. ఓవర్లలో 252 పరుగులకే నిష్క్రమించింది. ఇఫ్తికార్ అహ్మద్ (72 బంతుల్లో 94, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో కివీస్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాకిస్తాన్ అగ్రస్థానం కూడా బోల్తా కొట్టింది. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుంటే పాకిస్తాన్ ఈ స్థానాన్ని దక్కించుకునేది. కానీ చివరి వన్డేలో ఓడటంతో ఆ జట్టు.. మూడో స్థానానికి పడిపోయింది.
తాజా ర్యాంకుల ప్రకారం.. 113 పాయింట్లతో ఆస్ట్రేలియా తిరిగి నెంబర్ వన్ హోదాను దక్కించుకోగా.. అవే పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. 112 పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానానికి పడిపోగా.. ఇంగ్లాండ్ (111), న్యూజిలాండ్ (108) లు టాప్-5 స్థానాల్లో ఉన్నాయి. వన్డేలలో రెండో స్థానంలో ఉన్న భారత్.. టెస్టులు, టీ20లలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
కాగా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాను ట్రోల్ చేస్తూ నానా రచ్చ చేశారు. బర్నాల్ యాడ్‌ను షేర్ చేస్తూ ‘కొంతమందికి ఎక్కడో కాలుతున్నట్టుంది. ఇది రాసుకోండి’అని ట్వీట్స్ చేశారు. అయితే 48 గంటలకే ఇప్పుడు అదే బర్నాల్ వారికి అవసరమొచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.