Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ డ్రమెటిక్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. సందీప్ శర్మ వేసిన బంతిని అబ్దుల్ సమద్ బలంగా కొట్టాడు. అది నేరుగా లాంగాఫ్‌లో ఉన్న జోస్ బట్లర్ చేతిలో పడింది. దీంతో రాజస్తాన్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే షాక్. సందీప్ వేసింది నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. దీంతో లక్ష్యం ఒక్క బంతికి నాలుగు పరుగులుగా మారింది. ఈ దశలో సందీప్ వేసిన బంతిని అబ్దుల్ సమద్ నేరుగా సిక్సర్‌గా తరలించాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ టార్గెట్‌ను దగ్గరకు తీసుకురాగా, అబ్దుల్ సమద్ ఒత్తిడిలో భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.


ఇక రాజస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ (95: 59 బంతుల్లో, 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ సంజు శామ్సన్ (66 నాటౌట్: 38 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి చెలరేగాడు.


అదరగొట్టిన గ్లెన్ ఫిలిప్స్, సమద్
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ శుభారంభం ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. బౌండరీలు సిక్సర్లతో చెలరేగాడు. లక్ష్యం వైపు సాగుతున్న దశలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ అవుటయ్యారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించారు.


ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. అయితే క్లాసెన్, అభిషేక్ శర్మ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. దీంతో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ విఫలం అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్ విజయానికి 41 పరుగులు అవసరం అయింది. కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మొదటి మూడు బంతులను సిక్సర్లు, నాలుగో బంతికి ఫోర్ కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ ఐదో వికెట్‌కు అవుటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం అయ్యాయి. రెండో బంతికి సిక్సర్ సమర్పించిన సందీప్ శర్మ ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. అయితే కీలకమైన చివరి బంతి నోబాల్ కావడంతో పాటు ఆ తర్వాతి బంతికి అబ్దుల్ సమద్ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ సన్‌రైజర్స్ వశం అయింది. ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.


బట్లరే హీరో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఎప్పటిలానే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. ఫోర్లు, సిక్సర్లతో మంచి ఊపు మీదున్న యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసి మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్‌కు మొదటి వికెట్‌ను అందించాడు.


అయితే రాజస్తాన్ అసలు ఆట అప్పుడే మొదలైంది. క్రీజులో ఉన్న జోస్ బట్లర్‌కు కెప్టెన్ సంజు శామ్సన్ తోడయ్యాడు. వీరు రెండో వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 148 పరుగులు జోడించారు. ప్రారంభంలో కొంచెం మెల్లగా ఆడిన ఈ జోడి క్రీజులో కొంచెం కుదురుకున్నాక చెలరేగిపోయింది. మిడిల్ ఓవర్లలో కూడా వీరు అద్భుతమైన రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. సెంచరీకి చేరువలో ఉండగా భువీ వేసిన అద్భుతమైన యార్కర్‌తో జోస్ బట్లర్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ సంజు శామ్సన్ ఎక్కడా తగ్గకుండా పరుగులు చేయడంతో రాజస్తాన్ భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, భువనేశ్వర్‌లకు చెరో వికెట్ దక్కింది.