ICC ODI Team Rankings: ఆసియా కప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్ (వన్డేలలో) హోదాలో అడుగుపెట్టింది. కానీ రెండు వారాల్లోనే ఆ జట్టు కథ తలకిందులైంది. ఇన్నాళ్లూ ఆటలో మాత్రమే నిలకడ లేని సమస్య అనుకుంటే ఇప్పుడు ర్యాంకులలోనూ అదే తడబాటును ప్రదర్శిస్తోంది. స్వంతదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌లను గెలుచుకున్న పాకిస్తాన్.. శ్రీలంక, భారత్ చేతులలో ఓడి ఆసియా కప్ నుంచి నిష్క్రమించడమే గాక నెంబర్ 1,2 ర్యాంకులను కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు రోహిత్ సేన వరుస విజయాలతో నెంబర్ 2 ర్యాంకును సొంతం చేసుకుంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ మూడో స్థానానికి దిగజారింది. ఆసియా కప్ - 2023 ప్రారంభానికి ముందు అఫ్గానిస్తాన్, శ్రీలంకలను ఓడించి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన పాకిస్తాన్.. గత వారం రెండో ర్యాంకుకు పడిపోయింది. భారత్‌తో ఓటమి ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేగాక ఆస్ట్రేలియా కూడా దక్షిణాఫ్రికాలో వరుసగా రెండు వన్డేలలో గెలవడంతో కంగారూలు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక తాజాగా భారత్ వరుస విజయాలతో దూసుకెళ్లడం.. శ్రీలంక చేతిలో పాక్ ఓడటం బాబర్ ఆజమ్ టీమ్‌కు ర్యాంకింగ్స్‌లో షాకిచ్చాయి.
తాజా ర్యాంకుల ప్రకారం ఆస్ట్రేలియా వన్డేలలో 3,061 పాయింట్లు, 118 రేటింగ్‌తో నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకుంది. గత వారం మూడో స్థానంలో ఉన్న భారత్ వరుస విజయాలతో 4,516 పాయింట్లు సాధించి 115 రేటింగ్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లింది. వరుస ఓటములతో పాకిస్తాన్ రేటింగ్ 3,102 కు పడిపోగా రేటింగ్ కూడా 115కు చేరింది. ఇక ఆసియా కప్ ఫైనల్‌తో పాటు ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగబోయే మూడు వన్డేలలో గెలిస్తే భారత్.. వరల్డ్ కప్ లో నెంబర్ వన్ హోదా కలిగిన జట్టుగా ఆడే అవకాశం ఉంటుంది.
ఇండియా డామినేషన్..
ఒక్క వన్డేలలోనే కాదు.. మిగిలిన రెండు ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోంది. టెస్టులలో భారత్ నెంబర్ వన్ టీమ్‌గా ఉంది. భారత్ 118 రేటింగ్ పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లు టాప్ - 5లో ఉన్నాయి. టీ20లలో కూడా అగ్రస్థానం భారత్‌దే.. 264 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ హోదాను అనుభవిస్తుండగా ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు టాప్ - 5లో ఉన్నాయి.
ఆటగాళ్ల జాబితా తీసుకుంటే వన్డేలలో బాబర్ ఆజమ్ నెంబర్ వన్ హోదాను నిలబెట్టుకోగా టీమిండియా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ తన కెరీర్ బెస్ట్ అయిన రెండో ర్యాంకుకు చేరాడు. టాప్ - 10లో రోహిత్ శర్మ (9వ స్థానం), విరాట్ కోహ్లీ (8వ స్థానం) కూడా భారత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బౌలర్ల జాబితాలో ఆసీస్ పేసర్ జోష్ హెజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉండగా భారత్ నపుంచి కుల్‌దీప్ యాదవ్ ఏడో స్థానంలో ఉండగా సిరాజ్ 9వ స్థానం దక్కించుకున్నాడు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్ నెంబర్ వన్ ర్యాంకులో ఉండగా భారత్ నుంచి హార్ధిక్ పాండ్యా ఆరో స్థానంలో ఉన్నాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial