ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ ముంచుకొస్తున్న వేళ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆసియా కప్ - 2023లో భాగంగా సూపర్ - 4లోనే నిష్క్రమించిన ఆ జట్టుకు ఇది మరింత ఆందోళన కలిగించేదే. పాక్ పేస్ త్రయంలో కీలకమైన నసీమ్ షా వరల్డ్ కప్‌లో తొలి అంచె మ్యాచ్‌లను ఆడేది అనుమానంగానే ఉంది. ఈ విషయాన్ని నిన్న శ్రీలంకతో మ్యాచ్ ముగిసిన తర్వాత స్వయంగా పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమే వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ నసీమ్ షా, హరీస్ రౌఫ్‌ల హెల్త్ అప్డేట్ గురించి బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లంకతో ఆఖరి బాల్ థ్రిల్లర్‌లో ఓడిన తర్వాత బాబర్ ఆజమ్‌ను విలేకరులు నసీమ్, హరీస్‌లు వన్డే వరల్డ్ కప్ వరకైనా కోలుకుంటారా..? లేదా..? అనేదాని గురించి ప్రశ్నించారు. వాళ్ల ప్రశ్నలకు బాబర్ సమాధానమిస్తూ.. ‘ఆ విషయం గురించి నేను తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి మా బ్యాకప్ ప్లాన్ గురించైతే నేనేమీ చెప్పదలుచుకోలేదు. కానీ హరీస్ రౌఫ్ అయితే బాగానే ఉన్నాడు. అతడికి అయింది కూడా చిన్నగాయమే. ఇక నసీమ్ షా విషయానికొస్తే.. అతడు వరల్డ్ కప్‌లో కొన్ని గేమ్స్‌ను మిస్ అయ్యే అవకాశమైతే ఉంది. అతడి రిహాబిటేషన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది నాక్కూడా సమాచారం లేదు. కానీ నాకు తెలిసినంతవరకైతే నసీమ్ షా వరల్డ్ కప్‌లో తొలి అంచె గేమ్స్‌ను మిస్ అవుతాడు. చూద్దాం. ఏం జరుగుతుందో..!’అని చెప్పాడు.
భారత్‌తో గత సోమవారం, మంగళవారం (వర్షం కారణంగా రెండ్రోజులు) ముగిసిన కీలక పోరులో హరీస్ తొలిరోజు ఐదు ఓవర్లు బౌలింగ్ వేశాడు. కానీ అదే రోజు అతడికి పొట్ట కండరాలు పట్టేయడంతో మరుసటి రోజు ఆడలేదు. ఇక నసీమ్ షా.. 9.2 ఓవర్లు బౌలింగ్ చేసి భుజం నొప్పితో విలవిల్లాడుతూ గ్రౌండ్‌ను వీడాడు. ఈ ఇద్దరూ భారత్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఆ తర్వాత నిన్న ముగిసిన శ్రీలంకతో మ్యాచ్‌లో కూడా ఈ ఇద్దరూ ఆడలేదు. ఈ ఇద్దరి స్థానంలో పాకిస్తాన్ షహన్వాజ్ దహానీ, జమాన్ ఖాన్‌లను భర్తీ చేసింది.
నసీమ్ షా ఎక్కడ..?
పాకిస్తాన్ - శ్రీలంక మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ డగౌట్‌లో కనిపించినా నసీమ్ షా మాత్రం కనబడలేదు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వర్గాల సమాచారం ప్రకారం.. నసీమ్‌ను లంకతో మ్యాచ్ కంటే ముందే దుబాయ్‌కు పంపినట్టు తెలుస్తున్నది. అక్కడ అతడి భుజానికి స్కాన్ చేయించిన వైద్య బృందం నసీమ్ పరిస్థితిని సమీక్షిస్తున్నది. మరి అతడు ఎప్పటివరకు పూర్తిస్థాయిలో కోలుకుంటాడు..? తిరిగి ఎప్పుడు జట్టుతో చేరతాడు..? అన్నది మాత్రం క్లారిటీ లేదు.
భారత్‌తో పోరుకు కష్టమే..
ఆసియా కప్ నుంచి గాయం కారణంగా తప్పుకున్న నసీమ్.. వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే మ్యాచ్‌కు కూడా ఆడేది అనుమానమే. బాబర్ కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పాడు. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్.. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్ ఇందుకు వేదిక. ఇక ఇదే వేదికపై అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడే పాక్.. వరల్డ్ కప్‌లోనే మోస్ట్ అవేటెడ్ మ్యాచ్ అయిన దాయాదుల పోరు (అక్టోబర్ 14)కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. అదే జరిగితే పాకిస్తాన్‌కు భారీ షాక్ తాకినట్టే...!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial