Mayank Agarwal: భారత క్రికెట్‌ జట్టులో సూపర్ ఫిట్‌గా ఉన్న క్రికెటర్లు ఎవరో చెప్పండి..? అంటే  మొన్నటిదాకా చెప్పిన పేర్లు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా.  ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే వీళ్లకు ఈ  ఏడాది  యువ సంచలనం  శుభ్‌మన్ గిల్ సవాలు విసిరాడు. భారత క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే కొలమానంగా మారిన యో యో టెస్టులో   గిల్.. రికార్డు స్కోరు చేశాడు.  కొద్దిరోజుల క్రితమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో  యో యో టెస్టులో గిల్.. ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోరు  (18.7 పాయింట్లు) చేశాడు. కానీ ఈ రికార్డును టీమిండియా టెస్ట్ టీమ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ బ్రేక్ చేశాడు. 


క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రామాణికంగా మారిన యో యో టెస్టులో మయాంక్ ఏకంగా  21.1  పాయింట్లు స్కోరు చేశాడు. ఇది గిల్ (18.7), విరాట్ కోహ్లీ  (17.2)  కంటే  ఎక్కువ కావడం గమనార్హం.  ప్రస్తుతం  అక్టోబర్ నుంచి మొదలుకాబోయే దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్న మయాంక్.. యో యో స్కోరును ఘనంగా మెరుగుపరుచుకున్నాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను అతడే  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. అందుకు సిద్ధమవుతున్నట్టుగా అందులో పేర్కొన్నాడు.  ఇదే పోస్ట్‌లో లెవల్ 21.1  స్కోరు చేసినట్టు రాసుకొచ్చాడు. 


 






కాగా గతనెలలో ఆసియా కప్‌కు ముందు  బెంగళూరుకు సమీపంలోని ఆలూరులో  నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న భారత క్రికెటర్లకు యో యో టెస్టును నిర్వహించగా గిల్  18.1 స్కోరుతో అందరికంటే ముందు నిలిచాడు. తాను కూడా యో యో టెస్టులో 17 పాయింట్లు సాధించానని కోహ్లీ తన సామాజిక మాధ్యమాలలో  చేసిన  పోస్టుపై బీసీసీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆటగాళ్లు యో యో టెస్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను  పబ్లిక్ డొమైన్‌లో ఉంచరాదని   కోహ్లీతో పాటు ఇతర  ఆటగాళ్లనూ హెచ్చరించింది.  బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లెవరూ అలా చేయకూడదని కూడా అల్టిమేటం  జారీ చేసింది.   అయితే మయాంక్ మాత్రం   ప్రస్తుతం భారత జట్టులో  ఏ ఫార్మాట్‌లోనూ ఆడటం లేదు. 


 


టెస్టు స్పెషలిస్టుగా వచ్చిన మయాంక్.. ఇంగ్లాండ్‌తో గతేడాది   బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఆడాడు.  అది కూడా రోహిత్ శర్మ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఆ టెస్టులో అతికి ఆడే అవకాశమొచ్చింది. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో అతడు జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.  






మయాంక్ ఇంతరవకూ భారత జట్టు తరఫున 19 టెస్టులు, ఐదు వన్డేలు ఆడాడు.  టెస్టులలో 1,429 పరుగులు చేసిన అతడి ఖాతాలో నాలుగు సెంచరీలు, ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఇక  ఐదు వన్డేలలో అతడు చేసింది 86  పరుగులు మాత్రమే. ఐపీఎల్‌లో 2022 వరకూ పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మయాంక్‌ను  ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 8.5 కోట్లు వెచ్చించి  దక్కించుకున్నా అతడు  ఐపీఎల్-16లో కూడా దారుణంగా విఫలమయ్యాడు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial