ICC Cricket WC 2023: ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జరగాల్సి ఉన్న ఆసియా కప్‌లో ఆడేందుకు భారత  క్రికెట్ జట్టు తమ దేశం రావడం లేదనే కోపమో లేక మరే కారణమో గానీ   అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు పాకిస్తాన్ రోజుకో మాట మాట్లాడుతున్నది. గతంలో  తాము కూడా వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌కు రాబోమని.. తమకూ తటస్థ వేదిక కావాలని  పలువురు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ సభ్యులు, క్రికెటర్లు కామెంట్స్ చేయగా తాజాగా  బోర్డు మరో కొత్త రాగం అందుకుంది. వరల్డ్ కప్ ఆడేందుకు భారత్‌కు వస్తే రెండు స్టేడియాల్లోనే మ్యాచ్‌లు ఆడతామని కొర్రి పెట్టింది. 


రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరుగబోయే  ఈ ట్రోఫీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్‌లను  ఈడెన్ గార్డెన్  (కోల్‌కతా),  ఎంఎ చిదంబరం (చెన్నై  చెపాక్)   స్టేడియాల్లో మాత్రమే ఆడతామని కొత్త రాగం అందుకుంది. ఈ మేరకు ఐసీసీకి  ప్రతిపాదనలు కూడా పంపినట్టు సమాచారం. ఈ  మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా ఐదారు నెలల సమయం ఉండటంతో   పాక్ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది.  దీనిపై ఐసీసీ  కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చించేందుకు  సిద్ధమైందని పీటీఐ కథనం ద్వారా తెలుస్తున్నది.  


వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ   12 భారతీయ నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  లక్నో, ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, ఢిల్లీ, గువహతి,  హైదరాబాద్, ఇండోర్,  చెన్నై, కోల్‌కతా, ధర్మశాల  నగరాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  ఫైనల్  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచకప్ లోని ఫైనల్ తో కలుపుకుని 46 మ్యాచ్‌లు ఇవే వేదికల మీద  జరుగుతాయి.  


ఆ రెండే ఎందుకు..?  


ఆసియా కప్ లో భారత్  పాకిస్తాన్ కు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం భద్రతా లోపాలు. తమ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ  ఆసియా కప్ విషయంలో మొండిపట్టు పట్టి దానిని నెగ్గించుకుంది.  ఇప్పుడు పీసీబీ కూడా ఇదే   సూత్రాన్ని అమలుచేస్తోంది.  భారత్‌లో ఈ రెండు (కోల్‌కతా, చెన్నై) వేదికలైతే తమకు భద్రతాపరంగా సేఫ్ గా ఉంటాయని, గతంలో  కూడా ఇక్కడ తాము  విజయవంతంగా మ్యాచ్‌లు ఆడినట్టు పీసీబీ, ఐసీసీకి పంపిన ప్రతిపాదనలో ఉన్నట్టు సమాచారం.  


పాకిస్తాన్.. 2016లో భారత్ వేదికగా ముగిసిన  టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో ఆడిన మ్యాచ్‌ను కోల్‌కతాలోనే ఆడింది.  అంతేగాక గతంలో  చెన్నైలో కూడా భద్రతాపరంగా తమకు ఎలాంటి అడ్డంకులు రాకుండా  ఇక్కడ  సెక్యూరిటీ బాగా పనిచేశారని  అందుకే ఇవే రెండు వేదికలను తాము మ్యాచ్‌లు ఆడుకునేందుకు పరిగణించాలని  పీసీబీ కోరుతున్నట్టు ఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి  ఈ విషయంలో  బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.  చెన్నై, కోల్‌కతాలు సామర్థ్యం పరంగానే పెద్ద వేదికలు. చిన్నస్వామి (బెంగళూరు), వాంఖెడే  (ముంబై), హోల్కర్ (ఇండోర్) స్టేడియాలు చాలా చిన్నవి.  1996లో పాకిస్తాన్ జట్టు  చిన్నస్వామి స్టేడియంలో క్వార్టర్ ఫైనల్ ఆడింది. కానీ  అప్పటికి ఇప్పటికీ ఇరు దేశాల కాలమాన పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి.