Hardik Pandya Doubt For Australia T20 Series: చీలమండ గాయంతో  వరల్డ్‌కప్‌ నుంచి అవుటైన భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు  అందుబాటులో ఉండకపోవచ్చు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే టీమిండియా.. ఆస్ట్రేలియాతో టీ 20 సిరీస్‌ ఆడనుంది. నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది.  న‌వంబ‌ర్ 23, 26, 28, డిసెంబ‌ర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.


బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్యా... బౌలింగ్‌ చేస్తుండగా కుడి కాలు చీలమండకు గాయమైన  విషయం తెలిసిందే. పాండ్యా వేసిన మూడో బంతిని లిటన్‌ దాస్‌ స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. దీన్ని కుడి కాలితో ఆపే ప్రయత్నంలో హార్దిక్‌ చీలమండ బెణికింది. జారి కిందపడ్డ అతను తీవ్రమైన నొప్పితో అల్లాడాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. చికిత్స అనంతరం బౌలింగ్‌ చేద్దామని ప్రయత్నించినా హార్దిక్‌ వల్ల కాకపోవడంతో ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ పెవిలియన్‌ చేరాడు. మళ్లీ మ్యాచ్‌లో హార్దిక్‌ బరిలో దిగలేదు. స్కానింగ్‌ కోసం హార్దిక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటినుంచి పాండ్య వరుస మ్యాచ్ లకు దూరం అయ్యాడు. స్కాన్ తర్వాత హార్దిక్ పాండ్యా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.  మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఇండియన్ టీం లోకి  టీమిండియా హార్దిక్‌ పాండ్యా మళ్లీ తిరిగి రాలేదు. 


హార్దిక్‌ పాండ్యా గాయంతో దూరమవ్వడం కీలక సమయంలో రోహిత్‌ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.  ఎందుకంటే భారత జట్టులో ఉన్న నాణ్యమైన పేస్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఒక్కడే. బ్యాట్‌తోనే కాక బంతితోనూ పాండ్యా తన వంతు పాత్రను సమర్థంగా పోషించగలడు. వికెట్ల త్వరగా పడితే నిలబడి సమర్థంగా ఆచితూచి ఆడే సామర్థ్యంతో పాటు చివర్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగల సత్తా పాండ్యా సొంతం. బౌన్సర్లతో బ్యాటర్లను పాండ్యా ముప్పుతిప్పలు కూడా పెట్టగలడు. టీమిండియాలో ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే మూడో సీమర్‌ పాత్రను పాండ్యా నిర్వర్తించి జట్టు సమతుల్యతను కాపాడుతాడు.


ఇక ఇప్పుడు అయితే పాండ్య అందుబాటులో లేకపోవడంతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లో ఒకరు టీమ్‌ఇండియాకు సారథ్యం వహించనున్నారు. టీ20 జట్టుకు సూర్య వైస్ కెప్టెన్ కాగా.. ఇటీవల ఆసియా క్రీడల్లో రుతురాజ్ సారథ్యంలోని భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఈనెల 15న ప్రపంచకప్ సెమీస్ తర్వాత జట్టును ఎంపిక చేయనున్నారు.


 ప్రస్తుతం ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా, షమీ, సిరాజ్‌కు కంగారూలతో సిరీస్‌ నుంచి విశ్రాంతి ఇవ్వనుండడంతో వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌లతోపాటు తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, చాహల్‌లకు టీమ్‌లో చోటు లభించవచ్చు. అక్షర్‌ పటేల్‌ గాయం నుంచి కోలుకొంటే.. జడేజాకు విశ్రాంతినిచ్చి అతడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.