స్వదేశంలో జరగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా జోరు మీదుంది. ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్‌ సేన... పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 29న తన తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించి 2019 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే చీలమండ గాయంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో పాటు నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు కూడా హార్దిక్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం హార్దిక్‌ పాండ్యా లక్నో వెళ్తాడని బీసీసీఐ గతంలో ప్రకటించింది. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. హార్దిక్ ఇంకా టాబ్లెట్స్‌ వాడుతున్నాడని.. చీలమండపై వాపు బాగా తగ్గిందని.. కానీ అప్పుడే అతను బౌలింగ్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.



 హార్ధిక్ పాండ్యా ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్లడించాయి. పాండ్యాను మ‌రో మూడు మ్యాచ్‌ల వ‌ర‌కు దూరం పెట్టే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మశాల వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. హార్దిక్ లేకపోవటంతో కివీస్‌తో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే టీమిండియా ఆడాల్సి వచ్చింది. కుల్దీప్ యాదవ్ తొలుత భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ.. ఆరో బౌలర్ లేకపోవటంతో రోహిత్ కుల్దీప్‌నే కొనసాగించాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణిస్తూ టీమిండియా విజయాల్లో హార్దిక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తో ఇంకా మెరుపులు మెరిపించనప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం హార్దిక్ రాణించాడు. పాండ్యా ఈ వారాంతానికి కోలుకునే అవకాశం ఉందని... కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వడం ముఖ్యమని NCA వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత్‌ సెమీస్‌ ముంగిట నిలిచినందున నాకౌట్‌ మ్యాచులకు ముందు  హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు చీలమండ గాయం తగ్గుతోందని... అదృష్టవశాత్తూ కాలుకు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని BCCI వైద్య బృందం తెలిపినట్లు తెలుస్తోంది. అతను తదుపరి రెండు మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పింది. 



 ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హార్దిక్‌ను ఈ మ్యాచ్‌కు కూడా దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.  హార్దిక్ జట్టుకు దూరమైతే అతని స్థానంలో సరైన ప్రత్యామ్నాయం కూడా లేదు. దీంతో జట్టు సమతూల్యం దెబ్బతింటుంది. కానీ గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హార్దిక్ చికిత్స తీసుకుంటున్నాడని.. అతని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరినీ జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ అంతుబాటులో లేకపోతే అతని స్థానంలో అశ్విన్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ల‌క్నోలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుండగా.. ఈ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 



 స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మూడో బంతికే హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ నేరుగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కాలిని దూరంగా జరిపాడు. దీంతో బంతి అతని కాలికి బలంగా తాకింది. ఈ క్రమంలో హార్దిక్ చీలమండ భాగం మడత పడింది. దీంతో నొప్పితో విలవిలాడిన హార్దిక్ పాండ్యా వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ హార్దిక్‌ వరుసగా మ్యాచ్‌లకు దూరం అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది.