టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరం కావడంతో.. మిగిలిన మ్యాచ్‌లకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక సరైందే అన్న మీమాంస క్రికెట్ అభిమానులు వెంటాడుతోంది. కానీ ఐర్లాండ్‌తో జరిగిన టీ 20లతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ తనను తాను నిరూపించుకున్నాడు. బంతిని రెండు వైపులా స్పింగ్ చేయగల నేర్పు ప్రసిద్ధ్‌కు ఉంది. స్లో బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్‌నకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని సూచించారు.
కానీ జట్టు సమతూకం కోసం అప్పుడు జట్టులో చోటు లభించని ప్రసిద్ధ్ కృష్ణకు ఇప్పుడు అదృష్టం పాండ్యా గాయం రూపంలో తలుపుతట్టింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే సీమర్లు అద్భుతాలు సృష్టిస్తుండడంతో.. వారి అనుభవం నుంచి ప్రసిద్ధ్ కృష్ణా పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ అవకాశం దొరికితే మాత్రం ప్రసిద్ధ్ తన పేస్‌తో అద్భుతాలు చేయగలడు. గాయం నుంచి కోలుకుని ఐర్లాండ్‌తో ఆడిన తొలి టీ20కి ముందు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా 27 ఏళ్ల ప్రసిద్ధ్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున 14 వన్డేలు ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ.. 5.32 ఎకానమీతో 25 వికెట్లు తీశాడు. పదునైన బంతులను సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
2021 మార్చి 23న ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌తో ప్రసిద్ధ్ కృష్ణ వన్డేలోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం కూడా సాధించింది. 2021 మేలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు భారత స్క్వాడ్‌లో స్టాండ్‌బైగా కూడా ప్రసిద్ధ్ ఎంపికయ్యాడు. అదే సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌తో టెస్టుల్లోనూ ఆరంగేట్రం చేశాడు. 2022 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకుని సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రధాన బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ కొనసాగాడు. 2023 సీజన్‌లో గాయం కారణంగా ఆడలేదు. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 51 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక స్పీడ్‌స్టర్.... 49 వికెట్లు పడగొట్టాడు. 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రసిద్ధ్ కృష్ణను 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందంటే అతడి బౌలింగ్‌పై ఎంత నమ్మకం ఉంచిందో అర్థం చేసుకోవచ్చు.
గాయం నుంచి కోలుకుని పునరాగమనం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ యువ ఫాస్ట్ బౌలర్... ఇప్పుడు ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ప్రసిద్ధ్ కృష్ణ తన సత్తా చాటాడు. ఈ వన్డేలో టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆరంభలోనే ప్రసిద్ధ్ కృష్ణ వరుస షాక్‌లు ఇచ్చాడు. రెండో ఓవర్‌లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి టీమిండియాకు విజయం ఖాయం చేశాడు.