యువరాజ్ సింగ్.. ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. అద్భుత పోరాటపటిమకు నిలువెత్తు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు దక్కిన ఆణిముత్యం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతో విజయాన్ని అందించిన సందర్భాలు అనేకం. ఈరోజు యువీ 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు. పోరాట యోధుడిగా... భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడిగా... క్రికెట్ చరిత్రలో పంజాబీ పుత్తర్ యువరాజ్ సింగ్ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా కెరీర్ ఆరంభించిన యువీ ఆల్‌రౌండర్‌గా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించాడు . వరల్డ్ కప్ గెలవడంలో యువీ ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే.  ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా, స్పిన్ బౌలర్ గా, చురుకైన ఫీల్డర్ గా టీమిండియాకు దాదాపు 2 దశాబ్దాల పాటు తన సేవలందించాడు యువీ. సిసలైన ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1981, డిసెంబర్ 12న జన్మించిన యువీ నేడు 42వ పడిలోకి అడుగుపెట్టాడు. 


17 ఏళ్ల క్రితం అల్లరి చిల్లర అబ్బాయిగా, జల్సా రాయుడిగా, దూకుడైన మనస్తత్వం కలిగిన కుర్రాడిగా యువీ ఎన్నోసార్లు వివాదాల్లో కూరుకుపోయాడు. మైదానం బయట ఎన్నోసార్లు యువీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ప్రేమ వ్యవహారాలు కూడా అతనిని వార్తల్లో నిలిచేలా చేశాయి. కానీ తనపై తనకున్న విశ్వాసం, అంకితభావం, అంతులేని శ్రమ, పట్టుదల, తలవంచని పోరాట తత్వంతో యువరాజ్‌ తిరుగులేని కెరీర్ ను నిర్మించుకున్నాడు. కెరీర్ పాతాళంలోకి పడిపోయిన ప్రతిసారీ ఉత్తుంగ తరంగమై పైకి లేచాడు. ప్రపంచ క్రికెట్‌లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమైన అరుదైన ఘనతలను యువీ సొంతం చేసుకున్నాడు. 


యువీ.. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యువరాజ్ తొలిసారిగా తెరపైకి వచ్చాడు. యువరాజ్ 63 బంతుల్లో 69 పరుగులు చేసి లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి విజయనాదం చేసేలా చేశాడు. ఆ టోర్నీలో యువీ అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటికే తనకు క్యాన్సర్ సోకింది. అయినా కూడా ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. 2000 లో జరిగిన అండర్- 19 ప్రపంచకప్ లోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు.  ఫీల్డింగ్ లో చిరుతలా కదులుతూ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో క్యాన్సర్ తో పోరాడుతూ కూడా యువీ ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. 2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ మ్యాచులో ఇంగ్లిష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. భారత అభిమానుల మదిలో ఆ షాట్లు ఎప్పటికీ నిలిచే ఉంటాయి.


దాదాపు 2 దశాబ్దాల పాటు భారత క్రికెట్ కు తన సేవలందించిన యువీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రెండుసార్లు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్ గా యువీ ఘనత సాధించాడు. 2009లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన యువరాజ్ సింగ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మరలా ఆ ఏడాది ఐపీఎల్ లోనే డెక్కన్ ఛార్జర్స్ పై హ్యాట్రిక్ అందుకున్నాడు. 2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లలో యువీ భాగమయ్యాడు.