అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కొత్త రూల్ నేడు అమల్లోకి రానుంది. ఆటలో మరింత వేగం పెంచేందుకు..అనవసరం సమయం వృథాను అరికట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీ కొత్త నిబంధనను నేటి నుంచి అమల్లోకి తేనుంది. స్టాప్ క్లాక్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. దీని ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు... అంటే ఒక నిమిషం లోపు మరో ఓవర్ తొలి బంతి వేసేందుకు బౌలర్ సిద్ధంగా ఉండాలని ఐసీసీ తెలిపింది.
అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే రెండు సార్లు హెచ్చరిస్తారు. మూడోసారి నుంచి ఫీల్డింగ్ జట్టుకు అయిదు పరుగుల జరిమానా విధిస్తారు. వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్ నుంచే ఈ స్టాప్ క్లాక్ నిబంధన ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. మరింత వేగంగా ఆట కొనసాగేలా చూసేందుకు ఈ నిబంధనను అమల్లోకి తెస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆట వేగాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తూనే ఉంటామని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2022లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు విజయవంతం కావడంతో ఇప్పుడు పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్లో స్టాప్ క్లాక్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్ వెల్లడించారు. ఈ ప్రయోగత్మక నిబంధనన అమలును పరిశీలించి... వచ్చే ఫలితాలను బట్టి అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ప్రకటించింది.
ఇటీవలే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుటైన తర్వాత... బౌలింగ్‌కు కూడా నిమిషం నిబంధన తెచ్చారు. తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుటయ్యాడు. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి శ్రీలంక(Sri Lanka) క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews) టైమ్‌డ్ ఔట్(Timed Out)గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక, బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. రెండు నిమిషాల్లోగా అతను బంతిని ఎదుర్కోకపోవడంతో మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో అతడు ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకూ ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వలేదు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan).. మాధ్యూస్‌ను టైమ్డ్ అవుట్ అంటూ అప్పీల్ చేశాడు. అంపైర్లు రెండుసార్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరినా షకీబుల్ హసన్ నిరాకరించడంతో ఏంజెలో మాధ్యూస్ కోపంగా పెవిలియన్‌కు చేరాడు. వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ 2 నిమిషాల్లోపు తదుపరి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే అతను టైమ్డ్ అవుట్ అవుతాడు. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని షకీబ్ అప్పీల్ చేశాడు. దాంతో అంపైర్లు సమయం సరిచూసి అవుట్‌గా ప్రకటించారు. దీంతో మాథ్యూస్ బంతి ఎదుర్కోకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. మాథ్యూస్ టైమ్డ్ అవుట్ వివాదంపై స్పందించాడు. బంగ్లాదేశ్ జట్టును, షకీబుల్ హసన్‌ను తాను చాలా గౌరవిస్తానని... తానైతే అలా టైమ్డ్ అవుట్‌కు అప్పీల్ చేసే వాడిని కాదని మాథ్యూస్ అన్నాడు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య అని, మరేదైనా జట్టు ఉండి ఉంటే అసలు అలా చేసి ఉండేదే కాదని ఏంజెలో మాథ్యూస్ అన్నాడు.