భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రేపటితో (జులై 7వ తేదీ) 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ధోని 2020లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. దాదాపు 17 సంవత్సరాల కెరీర్‌లో ఈ మహేంద్రుడు పొందని ప్రశంస లేదు, వినని విమర్శ లేదు. తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో రనౌటయి కెరీర్ ప్రారంభించిన ఈ జార్ఖండ్ డైనమైట్, చివరి మ్యాచ్‌లో కూడా రనౌట్‌తోనే కెరీర్ ముగించాడు.
అయితే ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇంకా ఆడుతున్నాడు. 2021 సీజన్‌లో కెప్టెన్సీ జడేజాకు అప్పగించినా అనుకోని పరిస్థితుల్లో మళ్లీ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చే సీజన్‌లో చెన్నై తరఫున బరిలోకి దిగుతాడా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
తొలి విధ్వంసం తెలుగు నేలపైనే...
2004 డిసెంబర్ 23వ తేదీన బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే తనకు గుర్తింపు మాత్రం తెలుగు నేలపైనే లభించింది. 2005లో విశాఖలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని చేసిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేరు. 123 బంతుల్లోనే 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 148 పరుగులను సాధించి పాక్ బౌలర్ల తాట తీశాడు. ఆ తర్వాత జైపూర్‌లో శ్రీలంకపై ఆడిన ఇన్నింగ్స్‌తో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి ధోని ఆ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇప్పటికీ వన్డేల్లో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.
నాయకత్వం అనుకోని వరం
2007 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఘోరంగా విఫలం అయింది. బంగ్లాదేశ్, శ్రీలంకల చేతిలో ఓడిపోయి అవమానకర పరిస్థితుల్లో గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చేసింది. దీంతో ఆటగాళ్లపై అభిమానుల ఆగ్రహం ఆకాశాన్ని తాకింది. ఏకంగా ఆటగాళ్ల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. ఈ దశలో మొదటి టీ20 వరల్డ్ కప్ వచ్చింది. టోర్నీని లైట్ తీసుకున్న బీసీసీఐ సీనియర్లందరికీ రెస్ట్ ఇచ్చి ధోని నాయకత్వంలో యువ జట్టును పంపించింది. కానీ ఈ జట్టు ఏకంగా కప్ కొట్టుకురావడంతో ధోని ఫుల్ టైం కెప్టెన్ అవ్వడానికి రూట్ క్లియర్ అయింది. పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో బౌల్ అవుట్ సమయంలో స్పిన్నర్లతో వేయించడం, ఫైనల్లో చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మకు అందిండచం వంటి సాహసోపేత నిర్ణయాలు ధోనికి నాయకుడిగా నిలబడే అర్హత ఉందని చెప్పాయి.
2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, ఆ వెంటనే 2013 చాంపియన్స్ ట్రోఫీల్లో విజయాలు ధోని ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్లలో ఒకడిగా నిలబెట్టాయి. కేవలం వన్డేల్లో మాత్రమే కాకుండా టెస్టుల్లో కూడా టీమిండియాను ధోని నంబర్ వన్ ర్యాంక్‌కు తీసుకెళ్లాడు. వన్డేల్లో కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే నంబర్ వన్ ర్యాంకుకు ధోని చేరుకున్నాడు. ఇది ఇప్పటికీ రికార్డే. నంబర్ వన్ ర్యాంకుకు చేరుకునే సరికి 42 వన్డేలు ఆడిన ధోని రెండు సెంచరీలు, ఎనిమిది అర్థ సెంచరీలతో 1372 పరుగులు సాధించాడు. సగటు 52.76 కాగా, స్ట్రైక్ రేట్ 103గా ఉంది.
వైకుంఠపాళిలో నిచ్చెనలతో పాటు పాములు కూడా ఉన్నట్లు తర్వాత ధోనికి ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల్లో టెస్టు సిరీస్‌లు 0-4తో వైట్‌వాష్ అవ్వడం, మనదేశంలో కూడా ఇంగ్లండ్ సిరీస్ 1-2తో ఓటమి పాలవడంతో ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. 2014-15 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టోర్నమెంట్ మధ్యలోనే ధోని తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతోపాటు 2017లో వన్డేలు, టీ20ల నుంచి కెప్టెన్‌గా కూడా వైదొలిగినా ఆటగాడిగా కొనసాగాడు. కెప్టెన్సీ వదులుకున్నాక ఆటగాడిగా కొంతమేరకు రాణించినా... 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ధోని ఇన్నింగ్స్ తనపై విమర్శలను మరింత పెంచింది. ఆ తర్వాత 2020 ఆగస్టు 14వ తేదీన సింపుల్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఏంటి ధోని స్పెషాలిటీ?
ధోనికి ముందు, ఆ తర్వాత టీమిండియాకు, ప్రపంచంలోని మిగతా జట్లకు ఎంతో మంది కెప్టెన్లు ఉన్నారు. కానీ ధోనికి ఉండే కూల్ అండ్ కామ్ నేచర్ తనను ప్రత్యేకంగా నిలబెడుతుంది. గెలిచినప్పుడు క్రెడిట్ జట్టుకు ఇవ్వడం, ఓడినప్పుడు బాధ్యతను తను తీసుకోవడం వంటివి ధోనిని మిగతా కెప్టెన్ల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది.
గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదిలేశాక మళ్లీ అనుకోని పరిస్థితుల్లో ఆ కెప్టెన్సీ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాతి సీజన్ ఆడతాడో లేదో ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఈ విషయం గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు... తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం ఎవ్వడికీ వంగి సలాం చేయదు... నేను పిడికెడు మట్టే కావచ్చు.. కానీ జాతీయ జెండాకున్నంత పొగరుంది..’ ఈ డైలాగ్ ధోనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫేర్‌వెల్ మ్యాచ్ కోసం ఎదురు చూడకుండా, ఎటువంటి డ్రామా చేయకుండా రిటైర్ అవ్వడమే దీనికి అసలైన నిదర్శనం.