Glenn Maxwell Injury: మరికొద్దిరోజుల్లో భారత్ వేదికగా మొదలుకానున్న వన్డే వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న కంగారూలు.. ఆ తర్వాత భారత్‌తో కూడా మూడు వన్డేల సిరీస్ ఆడనున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న ఆసీస్.. మరో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ఆడనుండగా, దానికి ముందే మ్యాక్సీ గాయపడి స్వదేశానికి బయల్దేరాడు.
ఈనెల 30 నుంచి ప్రొటీస్ టీమ్‌తో తొలి టీ20కి సన్నద్ధమవుతున్న క్రమంలో మ్యాక్స్‌వెల్ కాలికి గాయమైంది. ఎడమ కాలి చీలమండ గాయంతో అతడు స్వదేశానికి పయనమయ్యాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా మ్యాక్సీ.. ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి తీవ్రంగా గాయపడి సుమారు మూడు నెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు అదే కాలికి గాయం కావడంతో మ్యాక్స్‌వెల్ వరల్డ్ కప్ ఆడతాడా..? లేదా..? అన్నది అనుమానంగానే మారింది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ స్టార్ ఆల్ రౌండర్.. వన్డే టీమ్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే టీ20లలో మ్యాక్సీ నిష్క్రమణ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు అవకాశం కల్పించింది. గతేడాది ఆస్ట్రేలియాలోనే ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన వేడ్.. మళ్లీ ఈ ఫార్మాట్‌లో ఆసీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్ చివర్లో భారత పర్యటనకు రాబోయే ఆసీస్ టీమ్‌లో మ్యాక్స్‌వెల్ ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు చెబుతున్నా అతడి గాయం తీవ్రతను బట్టి చూస్తే మ్యాక్సీ రాక కష్టమేనని తెలుస్తున్నది.
దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా టీ20 షెడ్యూల్ :
- ఆగస్టు 30 : తొలి టీ20
- సెప్టెంబర్ 01 : రెండో టీ20
- సెప్టెంబర్ 03 : మూడో టీ20
ఈ మూడు మ్యాచ్‌లు డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానంలో జరుగుతాయి. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకూ ఈ రెండు జట్లు ఐదు వన్డేలలో తలపడనున్నాయి.
టీ20లకు ఆసీస్ జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర జాన్సన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆస్టన్ అగర్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial