Sunil Narine: ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడలలో  ఆటగాళ్ల ప్రవర్తన శృతి మించితే మ్యాచ్‌ను నడిపించే కోచ్‌లు సదరు ఆటగాళ్లకు  ‘రెడ్ కార్డ్’ చూపిస్తుంటారు. రెడ్ కార్డ్ చూపిస్తే ఆ ఆటగాడు ఫీల్డ్‌ను వీడాల్సిందే. ఇటువంటివి   క్రికెట్‌లో ఇప్పటివరకూ లేవు. కానీ వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో మాత్రం అక్కడి నిర్వాహకులు తొలిసారిగా ఈ రెడ్ కార్డ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.  దీనికి బలైన తొలి క్రికెటర్‌గా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ సునీల్ నరైన్ నిలిచాడు.  


ఆదివారం సెయింట్ కిట్స్‌లోని  వార్నర్ పార్క్ వేదికగా సెయింట్ కిటగ్స్ అండ్ నెవిస్  పాట్రియట్స్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య  జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా  సునీల్ నరైన్ బలయ్యాడు. నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు గాను  సునీల్ నరైన్ ఫీల్డ్‌ను.. 20 ఓవర్లో వీడాడు.  దీంతో చివరి ఓవర్‌లో షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్న నైట్ రైడర్స్ టీమ్.. 10 మందితోనే ఫీల్డింగ్ చేసింది. 


సీపీఎల్ - 2023 సీజన్‌లో భాగంగా నిర్వాహకులు కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. అవేంటంటే.. 18వ ఓవర్ ప్రారంభానికి ముందు  నిర్ణీత ఓవర్ రేట్ కంటే తక్కువ ఉంటే అప్పుడు 30 యార్డ్ సర్కిల్‌లో  మరో ఫీల్డర్ వచ్చి చేరుతాడు. మొత్తంగా ఐదుగురు ఫీల్డ్ సర్కిల్‌లోనే ఉండాలి. అదే 19 ఓవర్  వేయడానికి ముందుగా ఓవర్ రేట్ తక్కువగా ఉంటే ఇద్దరు ఫీల్డర్లు (మొత్తంగా ఆరుగురు సర్కిల్‌లో) అదనంగా 30 యార్డ్  సర్కిల్‌లోకి వస్తారు. ఇదే క్రమంలో 20 ఓవర్ ప్రారంభానికి ముందు నిర్దేశిత ఓవర్ రేట్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఫీల్డింగ్ జట్టు ఒక ఫీల్డర్‌‌ను కోల్పోతుంది.  ఆ కోల్పోయే ఆటగాడు ఎవరనేది కెప్టెన్ ఎంపికను బట్టి ఉంటుంది. నిన్న నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్..  సునీల్ నరైన్‌ను ఫీల్డ్ వీడాల్సిందిగా కోరడంతో ఈ వెటరన్ డగౌట్‌కు వెళ్లిపోయాడు. 


 






20వ ఓవర్లో ఫీల్డ్‌ను వీడినా నరైన్.. నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి  178 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని  నైట్ రైడర్స్ జట్టు 17.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టులో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), లోర్కన్ టక్కర్ (36),  కెప్టెన్ కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్,  5 సిక్సర్లు) వీరవిహారం చేసి విజయాన్ని అందించారు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన నైట్ రైడర్స్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. 


 













ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial