Glenn Maxwell Leg Fracture: క్రికెట్‌ అభిమానులకు షాక్‌! ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కాలు విరిగింది. తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తన మిత్రుడితో కలిసి బ్యాక్‌ యార్డ్‌లో పరుగెడుతుండగా మాక్సీ జారిపడ్డాడు. అతడి కాలు మడతపడింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు చాలాకాలం దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే వారమే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది.






గాయపడ్డ మాక్స్‌వెల్‌కు శనివారం శస్త్రచికిత్స జరిగిందని తెలిసింది. అతడు కోలుకొనేందుకు ఎన్నాళ్లు పడుతుందో తెలియడం లేదు. ఇప్పటికైతే ఇంగ్లాండ్‌ సిరీసులో అతడి స్థానంలో సేన్‌ అబాట్‌ను ఎంపిక చేశారు. బహుశా బిగ్‌బాష్‌ సీజన్‌ మొత్తానికి అతడు దూరమవుతాడని అంచనా. మెరుగదలను బట్టి కొన్ని వారాల తర్వాత అతడు ఎప్పుడు బ్యాటు పట్టుకుంటాడో తెలుస్తుంది. ప్రస్తుతం మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మాక్సీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఫిబ్రవరిలో టీమ్‌ఇండియాతో టెస్టు సిరీసుకు అతడు అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నారు.


'గ్లెన్‌ ధైర్యంగా ఉన్నాడు' అని జాతీయ సెలక్టర్‌ జార్జ్‌ బెయిలీ అన్నాడు. 'ఈ ప్రమాదం దురదృష్టకరం. మంచి టచ్‌లో ఉన్న సమయంలో ఇలా గాయపడ్డాడు. తెలుపు బంతి క్రికెట్లో అతడెంతో కీలకం. త్వరగా కోలుకొనేందుకు అతడికి అండగా నిలుస్తాం' అని వెల్లడించాడు. 'మెల్‌బోర్న్‌ స్టార్స్‌లో మాక్సీది కీలక పాత్ర. అతడు త్వరగా కోలుకోవాలి. సీజన్‌ ఆరంభంలో అతడు భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం. అతడు త్వరలోనే మా ముందుకొస్తాడని ఆశిస్తున్నాం' అని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జనరల్‌ మేనేజర్‌ బ్లెయిర్‌ క్రౌచ్‌ అన్నాడు.