PAK VS ENG Final:

  టీ20 ప్రపంచకప్ లో ఆఖరి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. పొట్టి కప్పు కోసం నేడే పాకిస్థాన్- ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఆఖరి మ్యాచుకు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ రెడీగా ఉంది. అయితే వరుణుడు ఆడనిస్తాడా అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.


సూపర్ - 12 దశలో ఓ మోస్తరుగా ఆడి సెమీఫైనల్ కు వచ్చిన ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచుల్లో మాత్రం అదిరే ప్రదర్శన చేశాయి. మొదటి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ అద్భుత విజయం సాధించి ఫైనల్ చేరింది. ఇక రెండో సెమీఫైనల్ లో పటిష్ఠ భారత్ ను ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి తుది పోటీకి అర్హత సాధించింది. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు ఉత్కంఠభరితంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఏంటో చూద్దాం. 


పాక్.. అనిశ్చితికి మారుపేరు


అనిశ్చితికి మారుపేరనిపించుకున్న పాకిస్థాన్ ఈ టోర్నీలోనూ ఆ పేరును సార్ధకం చేసుకుంటోంది. సూపర్ - 12 లో భారత్, జింబాబ్వేలపై ఓడిన పాక్.. ఓ దశలో సెమీఫైనల్ రేసులో లేనే లేదు. అయితే ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న పాకిస్థాన్ జట్టు వరుసగా 3 విజయాలు సాధించింది. కానీ పాక్ నాకౌట్ పోరుకు రావడం మాత్రం అదృష్టమనే చెప్పాలి. దక్షిణాఫ్రికా ఐర్లాండ్ చేతిలో ఓడిపోవటంతో ఆఖరి రోజున పాక్ సెమీస్ కు అర్హత సాధించింది. అయితే సెమీస్ లో మాత్రం న్యూజిలాండ్ పై సాధికారికంగా గెలిచి కప్పు అందుకునేందుకు తాము అర్హులమే అని చాటిచెప్పింది. 


బ్యాటింగ్ సమతూకం.. బౌలింగ్ అద్భుతం


గ్రూపు దశలో విఫలమైన పాక్ ఓపెనర్లు బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్ లు సెమీఫైనల్ మ్యాచులో అర్థశతకాలతో ఫామ్ లోకి వచ్చేశారు. మిడిలార్డర్ లో ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ లు బాగానే ఆడుతున్నారు. ఇక బౌలింగ్ లో ఆ జట్టు అద్భుతంగా ఉంది. షహీన్ అఫ్రీది, నసీం షా, రవూఫ్ లతో కూడిన పేస్ దళం ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. వీరి బౌలింగ్ ను ఎదుర్కోవడం ఇంగ్లండ్ కు సవాల్ అని చెప్పొచ్చు.


ఇంగ్లండ్.. జట్టునిండా మ్యాచ్ విన్నర్లే


మంచి బ్యాటింగ్ చేయగల మొయిన్ అలీ, సామ్ కరణ్ లు 7, 8 స్థానాల్లో బ్యాటింగ్ వస్తారంటే ఇంగ్లండ్ జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి జట్టు సూపర్ - 12 దశలో ఓ మోస్తరు ప్రదర్శనే చేసింది. కానీ సెమీస్ లో భారత్ పై 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇంగ్లిష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ విధ్వంసమే సృష్టించారు. వారిద్దరే 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. వారే కాక హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, బెన్ స్టోక్స్ లతో కూడిన బ్యాటింగ్ దళం వారి సొంతం. అయితే బౌలింగే కొంచెం బలహీనంగా కనబడుతోంది. స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ ఫాంలో ఉన్నారు. క్రిస్ వోక్స్, జోర్డాన్, మార్క్ ఉడ్, సామ్ కరన్ లతో కూడిన పేస్ బౌలింగ్ దళం రాణిస్తే ఇంగ్లండ్ కు తిరుగుండదు. 


వరుణుడు జరగనిస్తాడా!


ఈ ఫైనల్ ముఖ్యంగా పాకిస్థాన్ బౌలింగ్ కు, ఇంగ్లండ్ బ్యాటింగ్ కు మధ్య పోరుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ తుది పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. రెండు రోజులుగా మెల్‌బోర్న్‌ నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. శనివారం ఉదయం నుంచి అక్కడ వాన పడుతూనే ఉంది. ఆదివారం 95 శాతం వరకు వర్ష సూచన ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రిజర్వు డే రోజైన సోమవారమూ వరుణుడు రంగ ప్రవేశం చేస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచులు వరుణుడి ఖాతాలో చేరిన సంగతి తెలిసిందే.