Sunil Gavaskar Questions Fitness Culture: ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా వంటి కీలక ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) పై విమర్శలు వస్తున్న వేళ, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రంగంలోకి దిగాడు. సీఓఈ ఫిజియోలను నిందించడం సరైంది కాదని, అసలు లోపం ప్లేయర్ల ట్రెయినింగ్ పద్ధతుల్లోనే ఉందని గవాస్కర్ కుండబద్దలు కొట్టాడు. ఆటగాళ్లు జిమ్ ఫిట్‌నెస్ కంటే మ్యాచ్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మిడ్-డే కాలమ్‌లో రాసుకొచ్చాడు.
హామ్‌స్ట్రింగ్ గాయాలు.. జిమ్ ఫిట్ వర్సెస్ మ్యాచ్ ఫిట్"బుమ్రాకు మోకాలి సమస్య ఉండగా, చాలా మంది ఇండియన్ ప్లేయర్లు హామ్‌స్ట్రింగ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వారి ట్రెయినింగ్ విధానంలోనే ఏదో లోపం ఉంది కాబట్టే ఇలాంటి గాయాలు మళ్లీ మళ్లీ అవుతున్నాయి. వీరంతా ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు గాయపడుతున్నారు, కానీ నింద మాత్రం సీఓఈ ఫిజియోలపై వేస్తున్నారు. జిమ్ ఫిట్ కావడం కంటే మ్యాచ్ ఫిట్ కావడం చాలా ముఖ్యం. బహుశా ఫిట్‌నెస్ విషయంలో విభిన్న ఆలోచనలు ఉన్న తరం నుంచి నేను వచ్చి ఉండవచ్చు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
బయోమెకానిక్స్ రూల్స్.. ఐపీఎల్ నెట్ ప్రాక్టీస్ పై విమర్శలునెట్ ప్రాక్టీస్ లో బౌలర్లపై విధిస్తున్న పరిమితులను గవాస్కర్ ప్రశ్నించాడు. "బయోమెకానిక్స్ పేరుతో ప్రాక్టీస్ నెట్స్‌లో బౌలర్లు ఇన్ని బంతులు మాత్రమే వేయాలనే నిబంధన సరికాదు. ఐపీఎల్ లో కొంతమంది విదేశీ ఫిజియోలు నెట్స్‌లో బౌలర్లను 20 బంతుల కంటే ఎక్కువ వేయనివ్వడం లేదని తెలిసింది. మ్యాచ్ లో నో-బాల్స్, వైడ్లు లేకుండా కనీసం 24 బంతులు వేయాల్సి వచ్చినప్పుడు, నెట్స్‌లో తక్కువ బంతులు వేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది?" అని నిలదీశాడు. ఇలాంటి నిబంధనల వల్ల ప్లేయర్ల సహజ సామర్థ్యం దెబ్బతింటుందని విశ్లేషించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్, 2027 వరల్డ్ కప్ సన్నాహాలకు ఎదురుదెబ్బబుమ్రా, హార్దిక్ లాంటి మ్యాచ్ విన్నర్లు తరచూ గాయాల పాలవ్వడం డబ్ల్యూటీసీ (WTC) 2027 ఫైనల్ రేసుతో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ సన్నా హాలకు తీవ్ర ఆటంకంగా మారింది. ఈ గాయాల సమస్యను సీరియస్ గా తీసుకుని ట్రెయినింగ్ పద్ధతులను సరిదిద్దాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ముఖ్యమైన మ్యాచ్ లకు కీలక ఆటగాళ్లు దూరం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జట్టు ఫిజియో తో కూడా బీసీసీఐ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తుందని వార్తలు వెలువడ్డాయి.
