Gautam Gambhir: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-16 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన యువ సంచలనం రింకూ సింగ్‌ను ఇప్పుడే జాతీయ జట్టులోకి తీసుకోవద్దని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ఒక్క సీజన్‌లో మెరిసినంత మాత్రానా టీమిండియాలోకి ఎంపిక చేయడం కరెక్ట్ కాదని.. రింకూ దేశవాళీలో పరుగులు నిలకడగా ఆడుతూ తనను తాను నిరూపించుకోవాలని సూచించాడు. టీ20 వరల్డ్ కప్ - 2024లో రింకూను భారత జట్టులోకి తీసుకురావాలని వస్తున్న వాదనలపై కూడా గంభీర్ స్పందించాడు.
ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్‌లో ఇచ్చే ప్రదర్శనలనే సీరియస్‌గా తీసుకుంటున్నారు. దాని ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తున్నారు. రింకూ సింగ్ ప్రయాణం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. అతడు ఐపీఎల్‌లో చాలా బాగా ఆడాడు కూడా.. కానీ ఒక్క సీజన్‌లో బాగా ఆడినంత మాత్రానా అతడిని టీమిండియాకు ఎంపిక చేయడం కరెక్ట్ కాదు.. అతడు దేశవాళీలో నిలకడగా ఆడుతూ పరుగులు చేయనీయండి. అదే క్రమంలో మళ్లీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇదే నిలకడను ప్రదర్శిస్తే అప్పుడు అతడిని టీమిండియాలో చేర్చండి’అని చెప్పాడు.
కాగా రింకూ సింగ్ ఐపీఎల్-16 సీజన్‌లో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు 59.25గా ఉండటం గమనార్హం. ఈ సీజన్‌లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అతడు ‘సేవియర్’గా మారాడు. ఆ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతీసారి రింకూ ఆదుకున్నాడు. రింకూ ఈ సీజన్‌లో నాలుగు అర్థ సెంచరీలు కూడా చేయడం విశేషం. ఇక వెస్టిండీస్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌లో రింకూకు అవకాశం దక్కుతుందని అంతా భావించినా సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయే చూపారు. కానీ సెప్టెంబర్ - అక్టోబర్‌లలో చైనా వేదికగా జరుగబోయే ఆసియా క్రీడల్లో మాత్రం రింకూ చోటు దక్కించుకున్నాడు. త్వరలో జరుగబోయే ఐర్లాండ్ టూర్‌లో కూడా రింకూకు టీమిండియాలో చోటు దక్కే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
రింకూ గురించే గాక గంభీర్.. టీమిండియా తరఫున టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైస్వాల్ గురించి కూడా స్పందించాడు. జైస్వాల్ ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా నిలకడగా రాణిస్తున్నాడని గంభీర్ తెలిపాడు. రంజీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి శతకాలు ఉన్నాయని.. గత రెండేండ్లుగా అతడు దేశవాళీలో నిలకడగా ఆడుతున్నాడన్న విషయాన్ని మరిచిపోరాదని గంభీర్ వివరించాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial