Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పై పంజాబ్ కేసరి పత్రిక చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. హిందీ డైలీ అయిన పంజాబ్ కేసరి.. గంభీర్ ను ఉద్దేశిస్తూ.. ‘భస్మాసుర’అని పేర్కొనడం లక్నో మెంటార్ కు కోపం తెప్పించింది. దీంతో ఆయన ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశాడు.
ఇటీవల ఐపీఎల్ లో బిజీగా గడుపుతూ నియోజకవర్గ ప్రజలను గంభీర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. పంజాబ్ కేసరిలో ‘ఎంపీ గౌతం గంభీర్ కనిపించడం లేదు. ఢిల్లీ ఎంపీ లక్నో సూపర్ జెయింట్స్ కు భస్మాసురిడిగా మారాడు. దయచేసి ఆయనను కలిసేప్పుడు దూరం పాటించండి’ అని పేర్కొన్నది.
దీనిపై గంభీర్ పరువుకు భంగం కలిగిందని ఆరోపిస్తూ అతడి తరఫు న్యాయవాది అనంత్ దెహద్రయ్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇది గంభీర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ఈ మేరకు పంజాబ్ కేసరిపై రూ. 2 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. పంజాబ్ కేసరి ఎడిటర్ ఆదిత్య చోప్రా, కరస్పాండెంట్ అమిత్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ లు పాత్రికేయ స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని ఆయన దావాలో ఆరోపించారు.
కాగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, ధోనిల తర్వాత రెండు టైటిల్స్ నెగ్గిన సారథిగా ఘనత సాధించిన గంభీర్.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ లీగ్ లో కొనసాగుతూనే ఉన్నాడు. గత సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. పేరుకు మెంటార్ అయినా హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కంటే గంభీర్ పెత్తనమే ఎక్కువ. డగౌట్ లో కూడా ఆండీ ఫ్లవర్ కంటే గంభీరే ఎక్కువ కనిపిస్తాడు.
ఇదిలాఉండగా ఐపీఎల్ లో గంభీర్ మార్గదర్శకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్.. మంగళవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అనంతరం ముంబై.. 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. రోహిత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్.. నాలుగో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.