India vs England : ఉపఖండంలో టెస్ట్ మ్యాచ్‌లను గెల్చుకోవడం ఇండియాకు వెన్నతో పెట్టిన విద్యే. బాల్‌ను బొంగరంలా గింగిరాలు తిప్పుతూ మ్యాచ్‌లను కైవసం చేసుకోవడం ఇండియన్ క్రికెటర్లకు కొత్త కాదు. పిచ్‌పై విదేశీ బ్యాటర్లను మన స్పిన్నర్లు డ్యాన్స్ చేయిస్తే, SENA దేశాల పిచ్‌లపై మన ఇండియన్ క్రికెటర్స్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతుంటారు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పిచ్‌లు బౌన్సింగ్‌కు, స్వింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ దేశాల్లో పర్యటనలంటే బ్యాటింగ్ కోచ్‌లు క్రికెట్ మూలాలకు కట్టుబడి ఆడాలని సూచనలు చేస్తారు. అక్కడి పరిస్థితులను, బౌలర్లను గౌరవించాలని చెబుతారు. తమ చేతులు శరీరం దాటి పోకుండా ఉండేలా ఆడాలని క్రికెట్ మూల సూత్రాలను పదే పదే గుర్తు చేస్తుంటారు. దీనికి కారణం ఈ దేశాల్లోని పిచ్‌లు ప్రతీ బ్యాటర్‌కు సవాల్ విసురుతాయి. ఉపఖండ పిచ్‌లు చేసే పరుగులు ఒక ఎత్తు అయితే, SENA దేశాల పిచ్‌లపై పరుగులు చేయడం మరో ఎత్తు అనే చెప్పాలి. అలాంటిది యంగ్ బ్యాట్స్‌మన్ శుభమన్ గిల్ సారథిగా యంగ్ టీం ఇండియా ఇంగ్లీషు గడ్డపై అండర్సన్ - సచిన్ ట్రోఫీ కోసం ఐదు టెస్టు మ్యాచ్‌లకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ SENA దేశాల్లో సారథిగా తొలి సిరీస్‌లను ఆడిన ఇండియన్ క్రికెట్ కెప్టెన్లు ఎవరు, ఆ సిరీస్ ఫలితాలు ఏంటో తెలుసుకుందాం.
భారత తొలి టెస్ట్ కెప్టెన్ సి.కె. నాయుడు
భారత దేశ క్రికెట్ జట్టుకు తొలి టెస్ట్ కెప్టెన్ సి.కె. నాయుడు. 1932లో ఏకైక టెస్ట్ కోసం సి.కె. నాయుడు ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌కు భారత జట్టు పయనమైంది. ఈ చారిత్రాత్మక టెస్ట్ లార్డ్స్‌లో జరిగింది. ఇది నిజంగా ఓ సువర్ణ అధ్యాయంగా చెప్పాలి. భారత క్రికెట్ టీం తన తొలి టెస్ట్‌ను క్రికెట్‌కు పుట్టిల్లు అయిన ఇంగ్లండ్‌లో ఆడటం జరిగింది. అయితే ఈ ఏకైక టెస్ట్‌లో ఇండియా పరాజయం పాలైంది. అయితే నేటి మన క్రికెట్ టీం విజయాల వైపు పయనించడానికి అదే తొలి అడుగు అని చెప్పాలి.
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947-48లో, స్వతంత్ర భారత దేశంగా ఆడిన తొలి టెస్ట్ ఆస్ట్రేలియాతో జరిగింది. లాలా అమర్‌నాథ్ కూడా స్వతంత్ర భారత జట్టు తొలి కెప్టెన్. విదేశీ పర్యటనతోనే కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్ తొలి పర్యటన కూడా ఇదే. ఆస్ట్రేలియాకు, లెజండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మ్యాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇండియా సిరీస్‌ను 0-4తో కోల్పోయింది. ఒక మ్యాచ్‌ను ఇండియా డ్రా చేయగలిగింది.
ఇంగ్లండ్ టూర్‌కు విజయ్ హజారే
విజయ్ హజారే సారథిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే 1952లో తొలి విదేశీ పర్యటనకు ఇంగ్లండ్ వెళ్లాల్సి వచ్చింది. అతని సారథ్యంలో ఇండియన్ టీం నాలుగు టెస్టుల సిరీస్‌లో పోటీ పడింది. అయితే ఒక్క మ్యాచ్‌ను డ్రా చేసుకోగా, సిరీస్‌ను 0-3తో ఇండియా ఓడిపోయింది.
తొలిసారి సారథిగా దత్తా గైక్వాడ్‌కు తప్పని పరీక్ష
1959లో దత్తా గైక్వాడ్ ఇండియన్ టీం కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. ఆయన తన తొలి టూర్ ఇంగ్లాండ్ పర్యటన. కెప్టెన్‌గా ఆయనకు ఇది తొలి విదేశీ పర్యటన. కానీ ఫలితం మామూలే. ఐదు మ్యాచ్‌ల సిరీస్. ఇండియా ఈ సిరీస్‌ను 0-5 తేడాతో ఓడిపోయింది.
చరిత్ర సృష్టించిన టైగర్ పటౌడి
మన్సూర్ అలీఖాన్ పటౌడిని అందరూ ముద్దుగా టైగర్ పటౌడి అని పిలుచుకుంటారు. కెప్టెన్‌గా ఆయన అరంగ్రేటం చేసింది 1962 వెస్టిండీస్ ( SENAలో వెస్టిండిస్ భాగం కాదు ) పర్యటనలో. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న నారీ కాంట్రాక్టర్ గాయపడటంతో, 21 ఏళ్ల పటౌడి అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఆ సమయంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. అయితే ప్రపంచ విజేతగా, బలమైన జట్టుగా ఉన్న వెస్టిండీస్ ఐదు టెస్టుల సిరీస్‌ను 0-5 తేడాతో గెల్చుకుంది. అయితే ఆ పర్యటన తర్వాత పూర్తి స్థాయి సారథిగా పటౌడి 1967-68లో న్యూజీలాండ్ పర్యటనకు వెళ్లారు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను పటౌడి ఆధ్వర్యంలోని భారత జట్టు 3-1 తేడాతో గెల్చుకుంది. విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. ఇది పటౌడి నాయకత్వ పటిమకు నిదర్శనంగా క్రికెట్ నిపుణులు చెబుతారు.
కింగ్ కోహ్లీ దూకుడుకు సాక్ష్యం ఆస్ట్రేలియా గడ్డ
2014-15 ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇది కింగ్ కోహ్లీకి టెస్ట్ కెప్టెన్‌గా తొలి సిరీస్. నాలుగు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ నాయకత్వం వహించారు. అయితే ఈ సిరీస్‌ను 0-2తో ఇండియా కోల్పోయింది. అయితే ఈ సిరీస్‌లో కోహ్లీ దూకుడైన క్రికెట్‌ను ఆస్ట్రేలియన్లకు రుచి చూపించారు. ఆ తర్వాత జరిగిన 2018-19 సిరీస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై కంగారూలను ఓడించి చరిత్ర సృష్టించారు.
భారత క్రికెట్ కెప్టెన్‌లు తమ తొలి విదేశీ లేదా తొలి SENA దేశ పర్యటనలలో అపజయాలు-విజయాలను రుచి చూశారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి వంటి క్రికెట్ కెప్టెన్లు అరంగ్రేటం పరీక్షలో పాసై చరిత్ర సృష్టించారు. ఈ గడ్డపై సెంచరీలు చేయడం, సిరీస్ విజయం కోసం ప్రతీ ఇండియన్ క్రికెటర్ కల. ఇక ఆ దేశాలను ఆ గడ్డపైనే ఓడించి సిరీస్ కప్‌ను ఒడికి పట్టుకోవాలన్న తపన ప్రతీ కెప్టెన్ ది. అయితే ఈ ఇంగ్లండ్ సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శుభమన్ గిల్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ యంగ్ టీం ఇండియా.