Sai Sudharsan Debut: దక్షిణాఫ్రి, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో టెస్ట్ క్రికెట్ ఆడటం ఏ భారతీయ క్రికెటర్‌కైనా గొప్ప సవాలు. ఇంగ్లాండ్‌లోని వాతావరణం, పిచ్‌లు, స్వింగ్, సీమ్‌లు, బౌన్స్‌లు మరిన్ని సవాల్‌ విసురుతాయి. ఇటీవలే భారతీయ టెస్ట్ క్రికెట్‌ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ తప్పుకున్నారు. ఇప్పుడు టీమ్‌లో ఉన్న వారంతా కొత్త మొహాలే. కొత్త స్ఫూర్తి, కొత్త ఆశయాలతో ఇప్పుడు యంగ్ టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. 

ఇలాంటి యంగ్‌ టీంలో ఐపీఎల్‌ ఆరెంజ్ క్యాప్‌ విన్నర్‌ సాయి సుదర్శన్‌ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు టెస్టుల్లో సత్తా చాటేందుకు తొలిసారిగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. సాయి సుదర్శన్ 66 నెంబర్‌ జెర్సీ అందజేశారు. అతని క్యాప్‌ నెంబర్‌ 317.  సాయి సుదర్శన ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక విప్లవాన్ని సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌కు కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ దుమ్మురేపాడు. ఏడు-అర్థ శతకాలు, ఒక శతకంతో సహా 759 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ని కైవసం చేసుకున్నాడు. అతను 23 ఏళ్ల వయసులోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగులు దాటిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు అంతకు ముందు షుబ్మాన్ గిల్, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్ల పేరున ఉండేది.  

ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్ టెస్ట్ సిరీస్‌కు ముందు టీమ్ సెలక్షన్‌లో ఎంపికైన సాయి సుధర్సన్, టీమ్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో, టెస్ట్‌లలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్న చర్చ సాగింది. ఇంగ్లండ్‌ వేళ్లే టీంలోనే కాదు ఇప్పుడు ఏకంగా ప్లేయింగ్ లెవన్‌లో చోటు లభించింది. ఇంగ్లాండ్‌లో టెస్ట్‌లు ఆడే అవకాశం ఏ క్రికెటర్‌ అయినా ప్రతిష్టాత్మకంగా భావిస్తాడు. సద్వినియోగం చేసుకొని సత్తా చాటాలని అనుకుంటారు. ఇప్పుడు అదే భావన వ్యక్తం చేశాడు సాయి సుదర్శన్. ఇంగ్లీష్ పిచ్‌లు అంత ఈజీగా ఉండవు. అలాంటి పిచ్‌లపై అరంగేట్రం చేస్తున్న సాయి సుదర్శన ప్రదర్శన ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉంది.  

ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు భారత టీమ్‌లో కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్ ఉంటే... ఓపెనర్లుగా జైస్వాల్, కెఎల్ రాహుల్ ఉన్నారు. సాయి సుధర్సన్‌కు టీమ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లలో కోచ్ గౌతం గంభీర్ అతనితో మాట్లాడి పిచ్‌ స్వభావంపై టెక్నిక్‌పై కొన్ని సూచనలు చేశాడు. సాయి సుధర్సన్ పిచ్‌ను చూసి, ప్రార్థన చేసి, ఫిస్ట్ పంప్ చేసిన సంగతి వైరల్ అయింది. అప్పుడే ఫస్ట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడనే విషయం ఖరారు అయ్యింది. ఇప్పుడు ఏకంగా అధికారిక ప్రకటన వచ్చేసింది. 

సాయి సుధర్సన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండగా కరణ్‌ నాయర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. సాయి సుదర్శన కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా మంచి ఫార్మ్‌ కనబరిచాడు. అతను 29 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 1957 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా 33 ఇన్నింగ్స్‌ల్లో సగటు 42.33, మూడవ స్థానంలో 8 ఇన్నింగ్స్‌ల్లో సగటు 34.88, ఆరవ స్థానంలో 6 ఇన్నింగ్స్‌ల్లో సగటు 45.33తో పరుగులు సాధించాడు.

ఇంగ్లాండ్‌లో సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో కొన్ని మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా సాయికి ఉంది. అతను 7 మ్యాచ్‌లు ఆడి, ఇంగ్లీష్ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఇది ఈ టెస్ట్ మ్యాచ్‌లో అతనికి చాలా ఉపయోగపడుతుందని టీమిండియా భావిస్తోంది.