ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరంలో ఆస్ట్రేలియా జట్టే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి గౌరవప్రదమైన స్కోరు చేసిన కంగారులు ఆ తర్వాత ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌... ఆస్ట్రేలియాను ఒక విధంగా తక్కువ పరుగులకే కట్టడి చేసింది. 49.3 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్‌ చేసి విజయం సాధించేలా కనిపించింది. కానీ టాపార్డర్‌ వైఫల్యంతో బ్రిటీష్‌ జట్టు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. 48.1ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగునే కొనసాగుతోంది. ఈ ఓటమితో ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌ కప్‌ ఆశలు కూడా గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత ఉంటుంది.  


 ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే ఇంగ్లండ్‌ బౌలర్లు కంగారులకు షాక్‌ ఇచ్చారు. రెండో ఓవర్‌లోనే వోక్స్‌ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్‌ను వోక్స్‌ 11 పరుగులకే వెనక్కి పంపాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్‌ను కూడా 15 పరుగులకే వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 38 పరుగులకే ఆసిస్‌ రెండో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ ఆసిస్‌ను ఆదుకున్నారు. 52 బంతుల్లో 3 ఫోర్లో 44 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్‌ను అదిల్‌ రషీద్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు పరుగులకే మరో వికెట్‌ పడింది.


6 బంతుల్లో మూడు పరుగులు చేసిన జోస్‌ ఇంగ్లిస్‌ను అవుట్‌ చేసి రషీద్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. 117 పరుగుల వద్ద కంగారులు నాలుగో వికెట్‌ కోల్పోయారు. 83 బంతుల్లో 7 ఫోర్లతో 71 పరుగులు చేసిన లబుషేన్‌ను వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 178 పరుగుల వద్ద కంగారులు అయిదో వికెట్‌ కోల్పోయారు. కానీ గ్రీన్‌ పోరాటం ఆపలేదు. జట్టు స్కోరును 200 పరుగుల మార్క్‌ దాటించాడు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న గ్రీన్‌ను విల్లీ బౌల్డ్‌ చేశాడు. 52 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసి గ్రీన్‌ అవుటయ్యాడు. స్టోయినీస్‌  35 పరుగులు చేశాడు. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌,  ఆడమ్‌ జంపా కూడా రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది.


ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. మార్క్‌ వుడ్‌ 2, అదిల్‌ రషీద్‌ 2 వికెట్లు తీశారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్క్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో అవుటయ్యాడు. 19 పరుగుల వద్ద జో రూట్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 19 పరుగులకే ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం డేవిడ్‌ మలన్, బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌ను లక్ష్యం దిశగా నడిపించారు. 64 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సుతో 50 పరుగులు చేసి మలన్‌ అవుటయ్యాడు. 90 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్‌ను జంపా అవుట్‌ చేయడంతో 169 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆస్ట్రేలియా విజయం ఖాయమనే అనుకున్నా ఇంగ్లండ్‌ టెయిలెండర్లు పోరాడారు. మొయిన్‌ అలీ 42, డేవిడ్‌ విల్లీ  15 పరుగులు చేయడంతో కంగారులకు కంగారు తప్పలేదు. చివర్లో ఒంటరి పోరాటం చేసిన క్రిస్‌ వోక్స్ 32 పరుగుల వద్ద అవుటవ్వడంతో ఇంగ్లండ్‌ ఓటమి ఖాయమైంది.


చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి రావడంతో బ్రిటీష్‌ జట్టు ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయింది. 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 33 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జంపా 3, కమిన్స్‌ 2, స్టార్క్‌ 2, హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది.