Ben Stokes Hints At Return To Bowling Duties: రాజ్‌కోట్(Rajkot) టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్(England)పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్ ద్వి శతక గర్జనతో బ్రిటీష్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. తొలి టెస్ట్‌లో గెలిచి మిగిలిన రెండు టెస్టుల్లో పరాజయం పాలైన ఇంగ్లాండ్... సిరీస్‌లో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో కీలకమైన రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ సారధి బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..?
రాంచీలో జరిగే నాలుగో టెస్టులో బౌలింగ్ చేయాలని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మంచి పేస్ ఆల్‌రౌండరైనా స్టోక్స్‌కు గత నవంబర్‌లో మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి బౌలింగ్‌కు ఇంగ్లాండ్ సారధి దూరంగా ఉంటున్నాడు. బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఇంగ్లండ్‌ను మళ్లీ గెలుపు బాట పట్టించేందుకు బెన్ స్టోక్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్టోక్స్ బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ జట్టులో మంచి సమతుల్యం కూడా లభిస్తుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే మళ్లీ బౌలింగ్ చేయాలని స్టోక్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి బౌలింగ్ ప్రారంభించడం గురించి వైద్య బృందంతో స్టోక్స్ మాట్లాడతాడని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తెలిపాడు. స్టోక్స్ 100 టెస్టుల కెరీర్‌లో స్టోక్స్ 197 వికెట్లు తీశాడు.
యశస్వీ రికార్డుల మోత
భారత యువ బ్యాటర్, భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. అసలు బజ్‌బాల్ ఆటంటే ఏంటో ఇంగ్లాండ్ జట్టుకు తెలుసొచ్చేలా చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో బ్రిటీష్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ప్రస్తుతం 7 మ్యాచుల్లో 861 పరుగులు చేశాడు. జైస్వాల్ తర్వాత 855 పరుగులతో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఉన్నాడు. టీమిండియా తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతివాటం బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. ఇంతకుముందు గంగూలీ పేరిట ఉన్న 535 పరుగుల రికార్డును 545 పరుగులతో యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా యశస్వి రికార్డు నమోదు చేశాడు.