భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది.  వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడిన బ్రిటీష్‌ జట్టు.. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరాలంటే అద్భుతమే జరగాలి. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైన బట్లర్‌ సేన.. సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 1996 వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. మళ్లీ ఈ వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం మాట్లాడిన ఇంగ్లండ్ సారధి జోస్‌ బట్లర్‌ తమ ఓటములపై ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తాము ఎందుకు ఓడిపోతున్నామో  తెలియడం లేదని అన్నాడు. జట్టు ఓటములకు పూర్తి బాధ్యత తనదే అని... తాను ముందుండి జట్టును నడిపించలేకపోయానని  వాపోయాడు. ఇంగ్లాండ్ ఈ స్థాయిలో విఫలం కావడానికి కారణాలేంటో తమకూ అంతుబట్టడం లేదని బట్లర్ వాపోయాడు. 

 

పూర్తి నిరాశలో బట్లర్‌

ఇంగ్లండ్ జట్టుకు ఇది చాలా కష్టకాలమన్న బట్లర్‌... జట్టంతా పూర్తిగా నిరాశలో కూరుకుపోయిందని అన్నాడు. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయామని బట్లర్‌ అంగీకరించాడు. తమ జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నా  వరుస ఓటములు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటముల తర్వాత తమకు బాధ, తమపై తమకే కోపం వస్తున్నాయని బట్లర్‌ అన్నాడు. వరుస వైఫల్యాలకు ఇదీ కారణమని చెప్పలేమని.. తాము  సెలక్షన్‌ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నాడు. ఓటములకు తాము కారణాలను అన్వేషిస్తున్నామని బట్లర్ పూర్తి నిరాశతో వ్యాఖ్యానించాడు. శ్రీలంకపై మ్యాచ్‌పైనా బట్లర్‌ స్పందించాడు. రూట్ రనౌట్‌ కావడం సహా వికెట్లు పారేసుకున్నామని అదే ఓటమికి కారణమైందన్నాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ కనీస ఆట ఆడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏం జరిగితే అది జరిగింది కానీ.. మిగతా మ్యాచ్‌ల్లో బాగా ఆడాలని అనుకుంటున్నామని బట్లర్ అన్నాడు. తాము పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నామని బట్లర్‌ అన్నాడు.

 

ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చతికిలపడింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. లంక బౌలర్ల ధాటికి కేవలం 156 పరుగులకే బ్రిటీష్‌ జట్టు కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో 33.5 ఓవర్లలో కేవలం 156 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూలింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో 25.4 ఓవర్లలోనే కేవలం రెండువికెట్లే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్‌ ఆశలను కూల్చేసింది. సధీర సమర విక్రమ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా....నిసంక మిగిలిన పనిని పూర్తి చేసి లంకకు కీలక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో లంక సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండగా ఇంగ్లండ్ ద్వారాలు మాత్రం దాదాపుగా మూసుకుపోయాయి.