న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుతం చేసింది. 299 పరుగుల లక్ష్యఛేదనలో 16 ఓవర్లలోనే ఏకంగా 160 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో (136: 92 బంతుల్లో, 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... బెన్ స్టోక్స్ (75: 70 బంతుల్లో, 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కూడా తనకు తగ్గట్లు వేగంగా ఆడాడు.


299 పరుగుల లక్ష్యంతో చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 139 పరుగులు సాధించింది. చివరి సెషన్‌లో విజయానికి 160 పరుగులు చేయాల్సి ఉండగా... కేవలం 16 ఓవర్లలోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ను ముగించారు.


మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిల్యాండ్ 553 పరుగులకు ఆలౌట్ అయింది. డేరిల్ మిషెల్ (190: 318 బంతుల్లో, 23 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) డబుల్ సెంచరీ మిస్సవ్వగా... టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో, 14 ఫోర్లు) సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఆరు వికెట్లు దక్కాయి.


అనంతరం ఇంగ్లండ్ 539 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలీ పోప్ (145: 239 బంతుల్లో, 13 ఫోర్లు, మూడు సిక్సర్లు), జో రూట్ (176: 211 బంతుల్లో, 26 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలు సాధించారు. ఓపెనర్ అలెక్స్ లీస్ (67: 125 బంతుల్లో, 11 ఫోర్లు), వికెట్ కీపర్ ఫోక్స్ (56: 104 బంతుల్లో, 11 ఫోర్లు) అర్థ శతకాలు కొట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఐదు వికెట్లు పడగొట్టాడు.


రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. విల్ యంగ్ (56: 113 బంతుల్లో, 8 ఫోర్లు), డెవాన్ కాన్వే (52: 109 బంతుల్లో, 8 ఫోర్లు), డేరిల్ మిషెల్ (62: 131 బంతుల్లో, నాలు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ శతకాలు సాధించారు.


చివరి రోజు ఇంగ్లండ్ 72 ఓవర్లలో 299 పరుగులు చేయాల్సి ఉండగా... కేవలం 50 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేశారు. టీ బ్రేక్ సమయానికి 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగుల వద్ద ఉండగా... చివరి సెషన్‌లో 16 ఓవర్లలోనే 160 పరుగులు సాధించారు. జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ జోడీ ఐదో వికెట్‌కు 20.1 ఓవర్లలోనే 179 పరుగులు జోడించింది. వీరిద్దరూ టీ20 స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చాలా త్వరగా ఛేదించింది.