Ind Vs Eng 1st Odi Live Updates; బౌలర్లు రాణించడంతో నాగపూర్ లో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ పూర్తి కోటా కూడా ఆడలేక పోయింది. 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. జోస్ బట్లర్ కెప్టెన్ ఇన్సింగ్స్ (67 బంతుల్లో 52, 4 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. జాకబ్ బెతెల్ అర్థ సెంచరీ (64 బంతుల్లో 51, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించాడు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (3/26) పొదుపుగా బౌలింగ్ చేసి సత్తా చాటాడు. అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణా (3/53) భారీగా పరుగులిచ్చినా కీలకదశలో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఈ మ్యాచ్ లో ఇద్దరు భారత ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేసర్ రాణా డెబ్యూ చేశారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడలేదు. శుభమాన్ గిల్ ప్లేసులో యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. 






అదిరే శుభారంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిల్ సాల్ట్ (32) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరి జోరుతో ఆరు ఓవర్లలోనే 50 పరుగుల స్కోరు దాటి, శుభారంభం దక్కింది. ముఖ్యంగా అరంగేట్ర పేసర్ రాణాను సాల్ట్ టార్గెట్ చేశాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జంట.. ఆ తర్వాత రెచ్చిపోయింది. రాణా వేసిన ఆరో ఓవర్లో ఏకంగా సాల్ట్ 26 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు కళ్లు చెదిరే సిక్సర్లు ఉండటం విశేషం. అలా కొనసాగుతున్న ఈ జంట జోరును అన్ లక్కీ వెంటాడిండి. 75 పరుగుల వద్ద సాల్ట్ రనౌటవడంతో కథ అడ్డం తిరిగింది. లేని పరుగుకు సాల్ట్ రనౌటయ్యాడు. ఆ తర్వాత డకెట్, హ్యారీ బ్రూక్ (0)ను రాణా ఔటో చేశాడు. దీంతో ఏడు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న జో రూట్ (19) ను అద్భుతమైన బంతితో జడేజా పెవిలియన్ కు పంపడంతో 111/4తో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. 


సూపర్ భాగస్వామ్యం.. 
దక్కిన శుభారంభాన్ని చేజేతులా నాశనం చేసుకున్న ఇంగ్లాండ్.. ఇన్నింగ్స్ త్వరలోనే ముగుస్తుందనిపించింది. అయితే ఈ దశలో బట్లర్, బెతెల్ సంయమనం పాటించారు. ఓపికగా ఆడుతూ, భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. నెమ్మదిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. ఈ క్రమంలో 58 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసుకున్న బట్లర్ ఆ తర్వాత ఔటయ్యాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి,  షాట్ మిస్ అవడంతో హార్దిక్ పాండ్య చేతికి చిక్కాడు. దీంతో ఆరో వికెట్ కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి ముగింపు పడింది. లియామ్ లివింగ్ స్టన్ (5) విఫలమయ్యాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలని బెతెల్ ప్రయత్నించాడు. ఈ దశలో 62 బంతుల్లో ఫిఫ్టీ చేసిన బెతెల్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయలేక పోయింది. చివర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లాండ్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. బౌలర్లలో మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది.  


Read Also: ICC Vs Srinath: చాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్న శ్రీనాథ్, మరో భారత అంపైర్ కూడా.. ఆ వివాదమే కారణమా..?