Kagiso Rabada Using Drugs: గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడ షాకింగ్ విషయాన్ని తాజాగా పంచుకున్నాడు. ఈ పేసర్ ఐపీఎల్ అరంభమయ్యాక తొలి రెండు మ్యాచ్ లు గుజరాత్ తరపున ఆడాడు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ పై బరిలోకి దిగి ఒక్కో వికెట్ చొప్పున తీశాడు. ఈ మ్యాచ్ లు ముగిశాక, పర్సనల్ రీజన్స్ వల్ల స్వదేశానికి అతను వెళ్లిపోయినట్లు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. అలయితే తాజాగా ఈ పర్సనల్ రీజన్ కు గల కారణాన్ని రబాడ వెల్లడించాడు. తన నిషేధిత డ్రగ్ ను వాడటంతోనే సస్పెన్షన్ కారణంగా ఐపీఎల్ ను వీడాల్సి వచ్చిందని తాజాగా పేర్కొన్నాడు. జరిగిన దానిపై తాను చింతిస్తున్నానని, మరింత స్ట్రాంగ్ గా దీని నుంచి బయట పడి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే రబాడ ఏం డ్రగ్ వాడాడో వెల్లడించలేదు. మొత్తం మీద రబాడ తాజా ప్రకటనతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెర పోయింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది.
నిషేధిత డ్రగ్స్ అంటే..సహజంగా ఆట ఆడుతున్నప్పుడు లేదా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు డ్రగ్స్ వాడటంపై కొన్ని పేర్లు ఉన్నాయి. ఆట ఆడుతున్నప్పుడు ఇన్ కాంపీటిషన్ టెస్టు అని, మాములుగా ఉన్నప్పుడు ఔట్ ఆఫ్ కాంపిటీషన్ టెస్టు అని వివిధ రకాలుగా అంటారు. అయితే రబాడకు ఎప్పుడు టెస్టు జరిగిందో తెలియదు. ఇక నిషేధిత డ్రగ్స్ జాబితాలో కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ, లాంటి పదార్థాలున్నాయని ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే రబాడ ఏం డ్రగ్ వాడాడో దానిపై స్పష్టత లేదు. ఇక తన నిషేధిత డ్రగ్ వాడినట్లు తేలడంతో అతనికి శిక్ష విధించే అవకాశముంది. మూడు నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఈ పనిష్మెంట్ ఉండనుంది.
రబాడ లేకపోయినా..గతేడాది మెగావేలంలో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది. తనను మెయిన్ బౌలర్ గా భావించి, భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే పర్సనల్ రీజన్స్ తో తను లీగ్ ఆరంభంలోనే వైదొలిగినా, వెంటనే తేరుకుంది. ఇప్పటివరకు టోర్నీలో 10 మ్యాచ్ లాడిన గుజరాత్ ఏడు విజయాలతో టాప్ -2లో కొనసాగుతోంది. మరొక్క విజయం సాధిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక రబాడ గైర్హాజరిలో ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 20 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు. అతనికి వెటరన్ ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, గెరాల్గ్ కొయెట్జీ పేస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. అన్ని రంగాల్లో రాణించి, 7వ విజయాన్ని నమోదు చేసుకుంది.