Ind Vs Eng 1st Odi Live Updates: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. గురువారం నాగపూర్లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై 4 వికెట్లతో విజయం సాధించింది. బ్యాటర్లు సమయోచితంగా రాణించడంతో తొలి వన్డేలో 68 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కిచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్‌లో భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు ఛేదించింది. వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ సూపర్ అర్థ సెంచరీ (96 బంతుల్లో 87, 14 ఫోర్లు)తో జట్టును దాదాపు విజయతీరాలకు చేర్చాడు. చివర్లో కాస్తలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అక్షర్ ఔటయ్యాక భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో టెన్షన్ రేగినా, బ్యాటర్లు అందుకు అవకాశమివ్వలేదు. సమయోచితంగా ఆడి జట్టును గెలిపించారు. శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. నాలుగో వికెట్ కు అక్షర్ తో కలిసి గిల్ జోడించిన 108 పరుగుల భాగస్వామ్యం కీలకంగా మారింది. రోహిత్ శర్మ(2) , యశస్వి జైస్వాల్ (15) విఫలమయ్యారు. బౌలర్లలో సాఖిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్ లకు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో భారత్ ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే ఆదివారం కటక్ లో జరుగుతుంది. గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
రోహిత్ మళ్లీ విఫలం..
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ టోర్నీ కి ముందు ఫామ్ లోకి రావాలని భావించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ వన్డేలో నిరాశే ఎదురైంది. లెగ్ సైడ్ పై వచ్చిన బంతిని ఫ్లిక్ చేయబోయి లివింగ్ స్టన్ కు దొరికిపోయాడు. అంతకుముందు జైస్వాల్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 19 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్ తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఆరంభంలో గిల్ చాలా ఓపికగా ఆడగా, శ్రేయస్ మాత్రం దూకుడుగా ఆడాడు. టీ20 తరహాలో రెచ్చిపోతూ సిక్సర్లు, ఫోర్లు బాదాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను ఈ జంట గాడిన పెట్టింది. కుదురుకున్నాక గిల్ కూడా బ్యాట్ ఝళిపించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో కేవలం 30 బంతుల్లోనే 50 పరుగులతో శ్రేయస్ ఫిఫ్టీ చేశాడు. ఇతని దూకుడుతోనే 14వ ఓవర్లోనే జట్టు స్కోరు వంద పరుగుల మార్కును దాటింది. అయితే ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ బౌలర్ జాకబ్ బెతెల్ ఈ జంటను విడదీశాడు. అతని బౌలింగ్ లో స్వీప్ షాట్ కు ప్రయత్నించి శ్రేయస్ ఔటయ్యాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో మూడో వికెట్ కు నమోదైన 92 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
కీలక భాగస్వామ్యం..
111/3తో ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్న దశలో బ్యాటింగ్ కు దిగిన అక్షర్ రెచ్చిపోయాడు. రావడంతో ప్రత్యర్థి బౌలర్ల లైన్ ను దెబ్బ తీసే విధంగా వేగంగా ఆడాడు. దీంతో మరో ఎండ్ లో ఉన్న గిల్ పై ఒత్తిడి తగ్గి, స్వేచ్ఛగా పరుగులు సాధించాడు. వీరిద్దరిని విడదీయాలని ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ చాలమంది బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో 60 బంతుల్లో గిల్, 46 బంతుల్లో పటేల్ అర్థ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్ కు కీలకమైన 108 పరుగులు జోడించారు. అనంతరం ఆదిల్ రషీద్.. అక్షర్ ను బౌల్డ్ చేసి చిన్న షాకిచ్చాడు. అయితే త్వరగా కేఎల్ రాహుల్ (2), గిల్ వికెట్లను కోల్పోవడంతో చివర్లో కాస్త టెన్షన్ నెలకొంది. అయితే హర్దిక్ పాండ్యా (12 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. బౌలర్లలో బెతెల్, జోఫ్రా ఆర్చర్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52), బెతెల్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బౌలర్లలో జడేజా, రాణాకు మూడేసి వికెట్లు దక్కాయి.