ENG vs SA, T20 World Cup 2024 Highlights: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024 )లో మ్యాచ్‌లు క్రమంగా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సూపర్‌ ఎయిట్‌లో దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్‌(ENG vs SA) మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు మధ్య విజయం దోబూచులాడింది. ప్రతీ ఓవర్‌కు ఆధిపత్యం చేతులు మారిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన బ్రిటీష్‌ జట్టు కీలక సమయంలో వికెట్లు కోల్పోయి  పరాజయం పాలైంది. ఈ విజయంతో సూపర్‌ ఎయిట్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించి సెమీస్‌కు దాదాపుగా చేరుకుంది. మరో పక్క డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ రెండు మ్యాచుల్లో ఒక విజయం సాధించి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 


 

డికాక్‌ మరో కీలక ఇన్నింగ్స్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌... సౌతాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  తొలి వికెట్‌కు హెండ్రిక్స్‌-క్వింటన్‌ డికాక్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు పది ఓవర్లలోనే 86 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 4.5 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా  63 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 200కుపైగా పరుగులు చేస్తుందని భావించారు. కానీ 86 పరుగుల వద్ద 25 బంతుల్లో 19 పరుగులు చేసిన హెండ్రిక్స్‌ను  మొయిన్‌ అలీ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మెరుపు బ్యాటింగ్ చేసిన డికాక్‌(Quinton de Kock) అవుట్‌ అవడంతో దక్షిణాఫ్రికా స్కోరు వేగం తగ్గింది. 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 65 పరుగులు చేసిన డికాక్‌ను.. ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. 92 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత హెన్రిచ్‌ క్లాసెన్‌ రనౌట్‌ కావడంతో 103 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 86 పరుగుల వరకూ ఒక్క వికెట్‌ కూడా కోల్పోని ప్రొటీస్‌.... 103 పరుగులకు వచ్చేసరికి మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్‌ మిల్లర్‌ 28 నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బ్రిటీష్‌ బౌలర్లలో ఆర్చర్‌ మూడు వికెట్లు తీసి రాణించాడు. 

 

పోరాడినా తప్పని ఓటమి..

164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఆరంభంలో దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. 15 పరుగుల వద్ద విధ్వంసకర బ్యాటర్‌ ఫిల్ సాల్ట్‌ను అవుట్‌ చేసిన రబాడ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. జోస్‌ బట్లర్‌ 17, బెయిర్‌ స్టో 16, మొయిన్‌ అలీ 9 పరుగులు చేసి అవుట్‌ అవ్వడంతో బ్రిటీష్‌ జట్టు 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ బ్రూక్‌-లివింగ్‌ స్టోన్‌ ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. బ్రూక్‌ 37 బంతుల్లో 53 పరుగులు చేసి బ్రిటీష్‌ జట్టును విజయానికి చేరువ చేశాడు. లివింగ్‌ స్టోన్‌ 33 పరుగులు చేసి బ్రూక్‌కు మంచి సహకారాన్ని అందించాడు. ఈ దశలో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ పరమైందని అంతా భావించారు. అయితే పుంజుకున్న ప్రొటీస్‌ బౌలర్లు  బ్రూక్‌-లివింగ్‌ స్టోన్‌ లను అవుట్ చేయడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. చివరి రెండు ఓవర్లో విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉండగా.... ఇంగ్లాండ్‌ 14 పరుగులే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.