ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు... దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన  అఫ్ఘానిస్థాన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అఫ్గాన్‌ తన ఆటతీరుతో ఆకట్టుకుందని టీమిండియా దిగ్గజాలు కొనియాడారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్  నుంచి మిథాలీ రాజ్‌ వరకు మాజీలు అఫ్గాన్‌ కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ ఆటతీరుపై భారత మాజీ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. ఇంతకీ దిగ్గజ క్రికెటర్లు ఏమని ట్వీట్ చేశారంటే...

 

సచిన్‌ టెండూల్కర్‌: రహ్ముల్లా గుర్బాజ్ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత అఫ్ఘానిస్తాన్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇంగ్లాండ్‌ జట్టుకు ఇది దుర్దినం. ఇంగ్లండ్ బ్యాట్సర్లు అఫ్ఘానిస్థాన్ నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇంకా సిద్ధమవ్వాల్సి ఉంది. పిచ్‌ను అద్భుతంగా అర్థం చేసుకున్న అఫ్గాన్‌ స్పిన్నర్లు విజయాన్ని సాధించారు. వారి అద్భుత ఆటతీరును మెచ్చుకోవాల్సిందే.

 

యూసుఫ్ పఠాన్: ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించడానికి అఫ్ఘానిస్తాన్ అన్ని విభాగాల్లో నాణ్యమైన క్రికెట్ ఆడింది. ఇది తిరోగమనం కాదు అద్భుతం.

 

రవిశాస్త్రి: అఫ్ఘానిస్థాన్‌కు వందనం. మీరు ప్రపంచ కప్ క్రికెట్‌లో అతిపెద్ద అలజడి సృష్టించారు. క్రికెట్‌ చరిత్రలో మీకు సముచిత గౌరవం దక్కుతుంది.

 

మిథాలీ రాజ్: అఫ్ఘానిస్థాన్‌కు ఇది చారిత్రాత్మక విజయం. ఢిల్లీలోని ఈ పిచ్‌పై అఫ్గాన్‌ స్పిన్‌ను చూడడం బాగుంది. షాహిదీ తన ఆటగాళ్లను బాగా ఉపయోగించుకున్నాడు. 150వ వన్డే మ్యాచ్‌లో మహమ్మద్ నబీకి మంచి బహుమతి లభించింది. ఇంగ్లాండ్ బౌలింగ్ అనుకున్నంతలా లేదు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన ఫలితం.

 

దినేష్ కార్తీక్: అఫ్ఘానిస్థాన్ బాగా ఆడింది. వారి ఆటను చూసి నేనుఆనందించాను. 

 

ఇర్ఫాన్ పఠాన్: అఫ్ఘానిస్తాన్‌కు అభినందనలు. మీరు ప్రతి విభాగంలో ఇంగ్లాండ్‌ను ఓడించారు. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో ఇక్రమ్ అలీఖిల్ అద్భుతంగా కనిపించాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ అత్యున్నత స్థాయిలో ఉంది. 

 

సురేశ్ రైనా: ఈరోజు అఫ్ఘానిస్థాన్‌ జట్టు అసాధారణ ఆటతీరుతో ఇంగ్లాండ్‌పై అనూహ్య విజయం సాధించింది. అఫ్గాన్‌ జట్టు సంకల్పం, నైపుణ్యాలు అద్భుతమైనవి. అఫ్గాన్‌లు చాలా బాగా ఆడారు.

 

అనిల్ కుంబ్లే: ప్రశంసనీయమైన ప్రదర్శనలతో ఇదీ ఒకటి. అఫ్ఘానిస్తాన్  అద్భుతమైన విజయాన్ని సాధించింది. 

 

2023 వన్డే వరల్డ్ కప్‌లో మొదటి సంచలనం నమోదైంది. ఇంగ్లాండ్‌పై అఫ్ఘానిస్థాన్‌ 69 పరుగుల భారీ తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్ఘానిస్థాన్‌ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (80: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు), ఇక్రమ్ అలిఖిల్ (58: 66 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (66: 61 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అతని వన్ మ్యాన్ షో సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు సాధించారు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 40.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది.