Harmanpreet Kaur is India's only centurion in Womens T20 World Cup: మహిళల టీ 20 ప్రపంచకప్(Women's T20 World Cup) ఆరంభానికి సమయం సమీపిస్తోంది. అన్ని జట్లు ఈసారి కప్పును ఎలాగైనా ఒడిసి పట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. భారత జట్టు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పును వదల కూడదని గట్టి పట్టుదలతో ఉంది. గతంలో రెండుసార్లు సెమీఫైనల్ కు, ఒకసారి ఫైనల్ కు చేరిన టీమిండియా.. కప్పును మాత్రం ఒడిసిపట్టలేకపోయింది. కానీ ఈసారి పురుషుల జట్టు టీ 20 కప్పును దక్కించుకుని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఇక మహిళల జట్టు కూడా ఈ నిరీక్షణకు తెరదించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో పురుషుల జట్టు కప్పును సాధించగా.. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur) సారథ్యంలో మహిళల జట్టు బరిలోకి దిగనుంది. మహిళల టీ 20 క్రికెట్ ప్రపంచకప్ లో సెంచరీ చేసిన తొలి భారతీయురాలిగా రికార్డు ఉన్న హర్మన్ ఈసారి కప్పును అందిస్తుందేమో చూడాలి. 


 

హర్మన్ మినహా ఎవరూ లేరు..

2018 మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్  అద్భుత శతకంతో మెరిసింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో హర్మన్ పొట్టి క్రికెట్లో శతకం సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. 51 బంతుల్లో 7 సిక్సర్లు, లు, 8 ఫోర్లతో 103 పరుగులు చేసింది. హర్మన్ విధ్వంసంతో ఆ మ్యాచులో భారత్ 194 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కివీస్ ను  160 పరుగులకే కట్టడి చేసి ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్  గెలుచుకుంది.  ఆరేళ్ల తర్వాత కూడా హర్మన్ సెంచరీ రికార్డు పదిలంగానే ఉంది. మరే భారత క్రికెటర్ శతకం చేసి ఆ రికార్డును బద్దలు కొట్టలేదు. ఓపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన 87, 83 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ మినహా మిగిలిన  బ్యాటర్లు ఎవరూ  90 పరుగుల మార్కును కూడా దాటలేదు. 


 

ఈసారి కప్పు మనదేనా?

అక్టోబరు 3న టీ 20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి హర్మన్‌ప్రీత్ కౌర్ భారత జట్టును ముందుండి నడిపిచంనుంది.35 ఏళ్ల హర్మన్.. ఈసారి భారత్ కు కప్పు తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. మహిళల T20ల్లో  ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న హర్మన్.. ఈసారి పోరాడాలని చూస్తోంది. 141 మ్యాచ్‌లు ఆడిన హర్మన్  28.08 సగటుతో 3426 పరుగులు చేసింది. ఇందులో ఓ శతకం, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీ 20 ప్రపంచ కప్‌లో 35 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 20.57 సగటుతో 107.66 స్ట్రైక్ రేట్‌తో 576 పరుగులు చేసింది. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ గా హర్మన్ రికార్డు సృష్టించింది. అక్టోబర్ 4న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తమ ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. టీమిండియా 2018, 2023 టీ20 ప్రపంచ కప్‌లలో సెమీ-ఫైనల్స్‌లో ఆడింది. 2020లో రన్నరప్‌గా నిలిచింది.