Mind Games Heat Up Ahead Of Border-Gavaskar Trophy:  క్రికెట్(Cricket) ప్రపంచమంతా భారత్-ఆస్ట్రేలియా(India Vs Australia) మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ( Border Gavaskar Trophy) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే తలపడేది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు. ఈ నవంబర్లో జరిగే ఈ టెస్ట్ సిరీస్ మాములుగా జరిగే అవకాశం లేదు. విజయం కోసం ఇరు జట్లూ సర్వ శక్తులు ఒడ్డే అవకాశం ఉండడంతో పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్లు మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా పైచేయి సాధించేందుకు సిద్ధంగా ఉంటారు. మైదానం బయట మానసికంగా అవతలి జట్టును దెబ్బ కొట్టేందుకు మాటల యుద్ధం చేస్తుంటారు. తాజాగా టీమీండియా స్టార్ పేసర్  మహ్మద్ షమీ(Mohammed Shami).. ఆస్ట్రేలియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇరు జట్ల మధ్య మైండ్ గేమ్ ఆరంభమైంది.

 





 

షమీ ఏమన్నాడంటే 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్‌లో ప్రారంభం కానుంది. అంతకు రెండు నెలల ముందే ఈ సిరీస్ పై అభిమానుల అంచనాలు పతాకస్థాయిని చేరుతున్నాయి. ఆసిస్ పై భారత్ స్పష్టమైన పైచేయి సాధిస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే  టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తాజాగా మైండ్ గేమ్ ఆరంభించాడు.ఆసక్తికర వ్యాఖ్యలతో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ సిరీస్ లో తాము ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నామని... ఇక ఒత్తిడి అంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుందని షమీ అన్నాడు. ఈ సిరీస్ లో ఫేవరెట్లు తామేనని.. భారత జట్టును ఓడించడం అంత సులభం కాదని అన్నాడు. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్ ఇటీవల చాలా బలంగా ఉందని... ఆ విషయాన్ని రికార్డులే చెప్తున్నాయని షమీ అన్నాడు.ఇటీవల భారత రికార్డును పరిగణనలోకి తీసుకుంటే ఆసీస్ మరింత ఒత్తిడికి గురవుతుందని షమీ అన్నాడు.

 

భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందా

ఇటీవల భారత్ రెండు సార్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2018/19, 2020/21 టూర్‌లలో భారత్ టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుని అద్భుతం చేసింది. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈసారి సవాలు గట్టిగానే ఉన్నా భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అంచనా వేస్తున్నారు.గత  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత అద్భుతం చేసింది. 2-1 సిరీస్ విజయం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. తొలి టెస్టులో కేవలం 36 పరుగులకే ఔటయినా.. షమీ వంటి కీలక ఆటగాళ్లను గాయాలతో మ్యాచులకు దూరమైనా.. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే నేతృత్వంలో భారత్ వీరోచితంగా పోరాడి సిరీస్ ను కైవసం చేసుకుంది.

 


 

షమీ వచ్చేస్తాడా...

స్టార్ ఇండియా పేసర్ మహ్మద్ షమీ తన ఫిట్‌నెస్ అప్‌డేట్‌ను అందించాడు.తాను త్వరలో జట్టులో చేరేందుకు తీవ్రంగా  కష్టపడుతున్నానని తెలిపాడు. తొందరపడి మళ్లీ గాయపడే ప్రమాదం ఉందని అందుకే.. ఫిట్ నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్ నెస్ సాధిస్తున్నాడు.  శస్త్రచికిత్స తర్వాత మొదటిసారిగా జూలైలో బౌలింగ్‌ను తిరిగి ప్రారంభించాడు.