Kl Rahul Has Given An Answer To The Speculations About Joining RCB: క్రికెట్ (Cricket)ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. రోహిత్ శర్మ(Rohit  Sharma) ముంబై(MI)ను వీడుతాడా... కేఎల్ రాహుల్(KL Rahul) అదే జట్టులో ఉంటాడా లేక మరో జట్టులోకి వెళ్తాడా.. ప్రాంఛైజీలు రిటైన్ చేసుకునే ఆటగాడు ధోనీ(Dhoni) ఒక్కడేనా.. ఇలా ఎన్నో అంశాలపై క్రికెట్ అభిమానులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. రోహిత్ శర్మ ముంబైను వీడి లక్నోలో చేరడం ఖాయమని.. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పడు రాహుల్ పేరు బలంగా వినిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్(LSG) కెప్టెన్ రాహుల్ ఆ జట్టును వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)లో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ లక్నో సారథ్యాన్ని వదిలేస్తే.. ఆ పగ్గాలను రోహిత్ శర్మ అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.



 

రాహుల్ వీడడం ఖాయమేనా..?

 

ఓవైపు ఐపీఎల్ 2025కు రంగం సిద్ధమవుతుండగా.. మరోవైపు ఆటగాళ్లు కూడా ప్రాంఛైజీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. చాలామంది ఆటగాళ్లు కొత్త ఫ్రాంఛైల వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తాజాగా కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అతను ఆర్సీబీ వైపు చూస్తున్నారని తెలిపెలా ఉన్నాయి. రాహుల్ లక్నో ఫ్రాంచైజీని విడిచిపెట్టి ఐపీఎల్ 2025కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరే అవకాశం ఉందని పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. తాజాగా అభిమాని-రాహుల్ మధ్య జరిగిన సంభాషణ ఈ వార్తలకు అంకురార్పణ చేసింది. "నేను ఆర్సీబీకి వీరాభిమానిని. చాలా కాలంగా ఆర్సీబీ జట్టును ఫాలో అవుతున్నాను. మీరు గతంలో ఆర్సీబీకి ఆడారు. మళ్లీ మీరు బెంగళూరు జట్టుకు ఆడతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు మరోసారి ఆర్సీబీకి ఆడాలని నేను కోరుకుంటున్నాను." అని ఓ అభిమాని రాహుల్ తో అన్నాడు. దీనికి స్పందించిన రాహుల్.. "అలా జరగాలని ఆశిద్దాం" అని సమాధానమిచ్చాడు. ఈ సమాధానంతో రాహుల్ మరోసారి ఆర్సీబీ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడన్న పుకార్లు వ్యాపించాయి.

 


 

ఆ గొడవ వల్లేనా..

గత ఐపీఎల్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాతో  KL రాహుల్ సంభాషణ వైరల్ అయింది. గోయెంకా ఆ వీడియోలో రాహుల్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో తర్వాత చాలామంది గోయెంకా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ అభిమానులు కూడా  లక్నోను వీడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

 

రాహుల్ 2013లో బెంగళూరుతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2014, 2015 సీజన్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున బరిలోకి దిగాడు. 2016లో తిరిగి రాహుల్.. బెంగళూరు జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా అతను మొత్తం 2017 సీజన్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. RCB నుంచి విడుదలైన తర్వాత రాహుల్ పంజాబ్ జట్టుతో చేరాడు. 2018 నుంచి 2021 వరకూ రాహుల్ పంజాబ్ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్ 2022లో లక్నో  అరంగేట్రం సీజన్ నుంచి ఆ జట్టుతోనే ఉన్నాడు. 2024 సీజన్్లో లక్నో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.