Neeraj Chopra misses Diamond League crown by 1 cm, finishes second in final:  భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా(Neeraj Chopra)ను దురదృష్టం వెంటాడింది. కేవలం ఒక్కటంటే ఒక్క సెంటీమీటర్ వ్యత్యాసంతో నీరజ్‌ చోప్రా  ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌(Diamond League)లో రెండో స్థానంలో నిలిచాడు. గతంలోనూ ఈ డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌లో రెండో స్థానంలోనే నిలిచిన నీరజ్‌... మళ్లీ అదే స్థానంలోనే నిలిచాడు. ఈసారి అగ్రస్థానంపై కన్నేసిన నీరజ్‌.. తీవ్రంగా పోరాడినా రెండో స్థానానికే పరిమితమయ్యాడు. ఈ పోటీలో ఆరు ప్రయత్నాల్లో నీరజ్‌ అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్‌ అండర్సన్‌ 87.87  మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఫైనల్లో నీరజ్‌కు-పీటర్స్‌ అండర్సన్‌కు మధ్య దూరం కేవలం ఒకే ఒక్క సెంటీమీటర్ కావడం విశేషం. 






 

ఆ ఒక్క సెంటీమీటర్‌

 లుసానే డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. గత ఆగస్టులో జరిగిన డైమండ్ లీగ్‌లోనూ నీరజ్ రెండో స్థానంలోనే నిలిచాడు. బ్రస్సెల్స్‌లోని కింగ్ బౌడౌయిన్ మైదానంలో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ లో మొత్తంగా ఆరు సార్లు బల్లెం విసిరిన నీరజ్‌.. మూడో ప్రయత్నంలో అత్యుత్తమ త్రో నమోదు చేశాడు. మూడో ప్రయత్నంలో నీరజ్‌  87.86 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ ఈటెను 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.97 మీటర్లతో థార్ఢ్‌ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. అగ్రస్థానంలో నిలిచిన గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్‌కు 30 వేల డాలర్లు ప్రైజ్ మనీ దక్కింది. అంతేకాక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కు నేరుగా అర్హత సాధించాడు. రెండో స్థానంతో సరిపెట్టుకున్ననీరజ్‌కు 12 వేల డాలర్ల బహుమతి వచ్చింది.

 

గాయం వేధిస్తున్నా..

ఈ డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు నీరజ్‌ సన్నద్ధత సరిగ్గా సాగలేదు. గజ్జల్లో గాయం కారణంగా నీరజ్‌ బాధపడుతున్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ సమయంలోనూ గాయంతోనే నీరజ్‌ బరిలోకి దిగాడు. దాంతో నీరజ్ ఈ ఫైనల్‌కు సరిగ్గా రెడీ అవ్వలేదు. అయినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కానీ నీరజ్‌ మంచి ఫామ్‌లో ఉండి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసినా మళ్లీ అగ్రస్థానంలో నిలిచేవాడే. కానీ గాయం కారణంగా నీరజ్‌ పూర్తి ఫిట్‌గా కనిపించలేదు. ఈ సీజ‌న్‌లో బ్రస్సెల్స్ లో జ‌రుగ‌బోయే డైమండ్ లీగ్ ఫైన‌ల్ చివ‌రిదని నీరజ్‌ ఇప్పటికే ప్రకటించాడు. ఇక నీరజ్‌ తన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని నెలలపాటు నీరజ్‌ టోర్నీలకు దూరం కానున్నాడు.  పారిస్‌ విశ్వ క్రీడల్లోనూ రెండో స్థానంలో నిలిచి నీరజ్‌ రజతం గెలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో పాక్‌ జావెలిన్ ప్లేయర్‌ నదీమ్ అగ్రస్థానంలో నిలిచాడు.