WPL 2025 latest live Updates: డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ లో రెండుసార్లు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం వడోదరలో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్ కిరణ్ నావ్ గిరే మెరుపు ఫిఫ్టీ (27 బంతుల్లో 51, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను 19.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి మాత్రమే 167 పరుగులు చేసిన ఢిల్లీ పూర్తి చేసింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (49 బంతుల్లో 69, 12 ఫోర్లు) వేగంగా ఆడి జట్టుకు శుభారంభాన్నిచ్చింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సదర్లాండ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో పట్టికలో రెండో స్థానానికి ఢిల్లీ ఎగబాకింది.
కిరణ్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీకి కిరణ్ అదిరే అరంభాన్నిచ్చింది. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగడంతో పవర్ ప్లేలోనే యూపీ 66 పరుగులు సాధించింది. అయితే కిరణ్ కు సహకరించే బ్యాటర్లు టాప్, మిడిలార్డర్లో కరువయ్యారు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్న కిరణ్.. స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యింది. ఈ దశలో మిగతా బ్యాటర్లు విఫలమవడంతో శుభారంభం వేస్ట్ అయింది. చివర్లో శ్వేతా షెరవాత్ (37), చినెల్ హెన్రీ (33 నాటౌట్) కాస్త ధాటిగా ఆడటంతో యూపీ కాస్త భారీ స్కోరునే సాధించింది. మిగతా బౌలర్లలో మరిజానే కాప్, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, మిన్ను మణికి తలో వికెట్ దక్కింది.
ల్యానింగ్ మెరుపు ఫిఫ్టీ..
యూపీ మాదిరిగానే ఛేజింగ్ లో ఢిల్లీకి సూపర్ ఆరంభం దక్కింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (16 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో సత్తా చాటడంతో ఇన్నింగ్స్ వాయువేగంతో స్టార్టయ్యింది. మరో ఎండ్ లో ల్యానింగ్ కూడా సత్తా చాటడంతో ఓవర్ కు పది పరుగులకు పైగా రన్ రేట్ తో ఢిల్లీ ఛేజింగ్ ఆరంభించింది. మధ్యలో షెఫాలీ ఔటవడంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ కావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. అయితే అన్నాబెల్ (41 నాటౌట్) యాంకర్ ఇన్నింగ్స్ ఆడి, పరిస్థితిని చక్కబెట్టింది. 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ల్యానింగ్.. ఆ తర్వాత ఔటయ్యింది. ఈ క్రమంలో కాప్ (29 నాటౌట్) వేగంగా ఆడి, సదర్లాండ్ తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. అబేధ్యమైన నాలుగో వికెట్ కు వీరిద్దరూ 48 పరుగులు జోడించడం విశేషం. బౌలర్లలో సోఫీ ఎకిల్ స్టోన్, కెప్టెన్ దీప్తి శర్మ, గ్రేస్ హారిస్ లకు తలో వికెట్ దక్కింది. ఇక టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన యూపీ.. ఇప్పటికీ పాయింట్ల ఖాతాను తెరవలేదు. గురువారం జరిగే లీగ్ మ్యాచ్ లో -తో - తలపడనుంది.
Read Also: Viral News: దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. బీసీసీఐ అల్టిమేటంతో.. ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ..