Indian Flag Hosted in Pakistan Stadium: బీసీసీఐ దెబ్బకు పీసీబీ దిగొచ్చినట్లు తెలుస్తోంది. తమ దేశానికి జట్టును పంపనందుకుగాను కరాచీలోని నేషనల్ స్టేడియంపై భారత జెండాను ఎగురవేయలేదు. దీనిపై భారత అభిమానుల నుంచే కాకుండా క్రికెట్ ప్రేమికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బోర్డు వర్గాలు కూడా లోలోపల మథన పడ్డాయి. అయితే తనదైన శైలిలో పీసీబీపై ఒత్తిడి తెచ్చి ఫ్లాగ్ ను ఆ దేశం చేతే పెట్టించేలా బోర్డు వ్యవహరించిందని కథనలు వెల్లడవుతున్నాయి. బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ కాగా, మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో భారత జెండాను ఎగురవేయడం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. భారత జెండా రెపరెపలాడటం చూసి, పులకరించి పోయిన భారత అభిమానులు సోషల్ మీడియాలో జెండాల ఫొటోలతో పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరలవుతున్నాయి. ఇక పాక్ ఫ్యాన్స్ కూడా తమ బోర్డు పెద్ద మనసుతో భారత జెండాను స్టేడియంపై పెట్టిందని కవరింగ్ ఇచ్చుకుంటున్నారు.
అసలేమైంది..?నిజానికి ఐసీసీ టోర్నీ జరుగుతుతున్నప్పుడు ఆ టోర్నీలో ఆడుతున్న దేశాల జాతీయ జెండాలను, స్టేడియాలపై వేళాడదీయాలి. ఇటీవల విడుదలైన ఫొటోల్లో భారత్ తోపాటు బంగ్లాదేశ్ దేశాల జాతీయ జెండాలు కనిపించలేదు. ముఖ్యంగా ముఖ్య స్టేడియమైన కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమయ్యే సరికి పీసీబీ వింత వివరణ ఇచ్చుకుంది. తమ దేశంలో ఆడుతున్న, అడుగు పెట్టిన దేశాల జెండాలు మాత్రమే ప్రదర్శిస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పినట్లు కథనాలు వెల్లడయ్యాయి. దుబాయ్ లో భారత్ మ్యాచ్ లు ఆడుతుండటంతోపాటు బంగ్లా.. ఇంకా పాక్ లో అడుగు పెట్టకపోవడంతో ఆ దేశ జాతీయ జెండాను ప్రదర్శించలేదని వివరణ ఇచ్చుకుంది.
బీసీసీఐ సీరియస్..తాజా ఘటనతో బీసీసీఐ సీరియస్ అయింది. బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అసలేం జరిగిందంటూ లైన్ లోకి వచ్చారు. అసలు భారత జెండాను ఎందుకు స్టేడియంపై ఎగురవేయలేదని, వెంటనే జెండాను ఎగురవేయాలని తాజాగా హుకూం జారీ చేశారు. దీంతో బుధవారం మ్యాచ్ లో పీసీబీ భారత జెండాను ప్రదర్శించింది. తాజాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్ లోని గఢాఫీ స్టేడియం, రావల్పిండిలోని స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి వచ్చేనెల 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఈనెల 20 బంగ్లాదేశ్ తో, 23 న పాక్, మార్చి 2న కివీస్ తో భారత్ మ్యాచ్ లు ఆడనుంది. గ్రూపు-ఏలో భారత్ ఆడుతుండగా, గ్రూప్ -బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్గానిస్తాన్ జట్లు ఆడుతున్నాయి. ఈ టోర్నీకి కటాఫ్ డేట్ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ -7 జట్లతో పాటు ఆతిథ్య జట్టు మాత్రమే అర్హత సాధిస్తాయి.