Deepak Chahar: మలేషియన్ ఎయిర్ లైన్స్ పై భారత బౌలర్ దీపక్ చాహర్ మండిపడ్డాడు. వారి విమాన ప్రయాణంలో తాము ఇబ్బందులు పడ్డామని తెలిపాడు. దారుణమైన అనుభవాన్ని చవిచూశామని చాహర్ ట్వీట్ చేశాడు. అసలింతకీ ఏం జరిగిందంటే...
న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ఆడనుంది. దీనికోసం కివీస్ పర్యటన ముగిసిన తర్వాత అక్కడ ఆడిన దీపక్ చాహర్, శిఖర్ ధావన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ కివీస్ నుంచి ఢాకాకు మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో వచ్చారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీంతో కలిశారు.
అయితే ఈ ప్రయాణంలో తాము ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చాహర్ తెలిపాడు. ‘మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఇది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా మా విమానాన్ని మార్చారు. బిజినెస్ క్లాస్‌లో మాకు ఆహారం అందించలేదు. ఇక మేం మా లగేజ్ కోసం 24 గంటలుగా వేచి చూస్తున్నాం. రేపు మాకు మ్యాచ్ ఉంది. మా పరిస్థితిని ఊహించుకోండి’ అంటూ చాహర్ శనివారం ట్రైనింగ్ సెషన్‌కు ముందు ట్వీట్ చేశాడు. దీనిపై మలేషియన్ ఎయిర్‌లైన్స్ కంప్లైంట్ లింక్ పంపించగా.. అది ఓపెన్ కావడం లేదని చాహర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్ మార్పుకు సంబంధించి విమానయాన సంస్థ బదులిచ్చింది. ‘అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. వాతావరణ, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగింది’ అంటూ పేర్కొంది.
రేపట్నుంచి బంగ్లాతో వన్డే సిరీస్
టీమిండియా రేపట్నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. బంగ్లాకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. అలానే బంగ్లాతో వన్డే మ్యాచులకు టీం మేనేజ్ మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ సేన్ లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో భారత్ కాగితంమీద బలంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోనున్నారు. మరి అందులో ఎంతమేర సఫలీకృతమవుతారో చూడాలి.