Virender Sehwag:  టీ20లు మాత్రమే క్రికెట్ ఆటను ముందుకు తీసుకెళ్తాయనే అభిప్రాయంతో తాను ఏకీభవించనని... భారత మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. టెస్టులు, వన్డేలు ఇప్పటికీ వాటి ఉనికి కోల్పోలేదని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్ వచ్చాక వన్డేలు, టెస్టులు వాటి ప్రభను కొంత కోల్పోయాయి. క్యాష్ రిచ్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన లీగ్ గా ఆవిర్భవించింది. దీని వల్ల కలిగే ఆర్ధిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇతర దేశాలు వాటి సొంత ఫ్రాంచైజీ టోర్నమెంట్లను ప్రారంభించాయి. మరోవైపు ఐసీసీ టీ20ని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నిస్తోంది. టీ20 లీగ్ ను ఒలింపిక్స్ లో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. 


టీ20లు ఒక్కటే కాదు


ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వన్డే, టెస్ట్ ఫార్మాట్లపై స్పందించాడు. క్రికెట్ ను ముందుకు తీసుకువెళ్లాడనికి టీ20 మాత్రమే మార్గం కాదు. టెస్టులు, వన్డేలు కూడా ఈ ఆటను ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్ లను ఐసీసీ నిర్వహిస్తూ అన్ని దేశాలు వాటిని ఆడేలా చూస్తూ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. అని సెహ్వాగ్ అన్నాడు. 


క్రికెట్ ఆడడానికి ఇదే సరైన సమయం


క్రికెట్ కెరీర్ ను కొనసాగించడానికి ఇప్పుడు సరైన సమయంగా సెహ్వాగ్ చెప్పాడు. టీ20ల్లో ఆడడం వల్ల కలిగే ఆర్ధిక ప్రయోజనాల వల్ల ఇప్పుడు క్రికెట్ ఆడేందుకు సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలిపాడు. క్రికెట్ ఆడడానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే ఆటగాళ్లు తమ దేశం కోసం ఆడకపోయినా.. ఈ టీ20 లీగుల్లో ఆడడం వలన ఆర్ధికంగా సురక్షితంగా ఉంటారు. అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ అన్నాడు.


ఐఎల్టీ 20 సూపర్ హిట్ అవుతుంది 


అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు నిర్వహిస్తున్న ఐఎల్టీ 20 లీగ్ విజయవంతమవుతుందని సెహ్వాగ్ అన్నాడు. ఆ లీగ్ ను ప్రొఫెషనల్స్ నిర్వహిస్తారని.. అందులో అత్యుత్తమ పాల్గొంటారని చెప్పాడు. ఈ లీగ్ యూఏఈలో జరగడం అందులో ఉన్న అతిపెద్ద ప్రయోజనంగా అభిప్రాయపడ్డాడు. అక్కడ లీగ్ జరగడం వల్ల పెద్ద సంఖ్యలో అభిమానులు ఆటను వీక్షించవచ్చని తెలిపాడు. ఎందుకంటే అక్కడి టైమ్ జోన్ అందరికీ అనుకూలంగా ఉంటుందని తెలిపాడు.