DCW vs GG:
విమెన్ ప్రీమియర్ లీగులో నేడు దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. 'మేమీ రోజు మొదట బౌలింగ్ చేస్తాం. వికెట్ తాజాగా ఉంది. ఎలా స్పందిస్తుందో చూడాలి. మెరుగ్గా బౌలింగ్ చేసి టార్గెట్ ఛేదించేందుకు ప్రయత్నిస్తాం. గుజరాత్‌తో ఇంతకు ముందు తలపడ్డప్పుడు మేం బాగా ఆడాం. ఆ జట్టులో మంచి క్రికెటర్లు ఉన్నారు. టారా నోరిస్ స్థానంలో పూనమ్ యాదవ్‌ను తీసుకున్నాం' అని లానింగ్ తెలిపింది.
'మేం రెండు మార్పులు చేశాం. మేఘనా, అనబెల్ స్థానాల్లో లారా, అశ్వనీని తీసుకున్నాం. డంక్లీతో కలిసి లారా ఓపెనింగ్ చేస్తుంది. కొన్ని మ్యాచులుగా ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో మేం మెరుగయ్యాం. బ్యాటింగ్‌లోనూ కొన్ని మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం' అని గుజరాత్ కెప్టెన్ స్నేహ రాణా తెలిపింది.
తుది జట్లు
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మాన్సీ జోషీ
దిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె కాప్, జెస్ జొనాసెన్, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్
ప్లేఆఫ్ రేసులో!
అరంగేట్రం సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఎదురు లేకుండా దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో పటిష్ఠంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచులో ఓటమి చవిచూసింది. ఓపెనర్లు మెగ్‌లానింగ్ (Meg Lanning), షెఫాలీ వర్మ (Shafali Verma) మెరుపు ఆరంభాలు ఇస్తున్నారు. అలిస్ క్యాప్సీ, మారిజానె కాప్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. వికెట్లు పడకుండా సమయోచితంగా ఆడేందుకు జెమీమా రోడ్రిగ్స్ ఉంది. జెస్ జొనాసెన్, తానియా భాటియా, రాధా యాదవ్ సైతం షాట్లు ఆడగలరు. బౌలింగ్‌లోనూ డీసీని ఆపడం కష్టం. టారా నోరిస్, శిఖా పాండే, కాప్ పేస్ బౌలింగ్ చేస్తున్నారు. రాధా యాదవ్, క్యాప్సీ స్పిన్‌తో చెలరేగుతున్నారు. ఈ జట్టును అడ్డుకోవాలంటే ప్రత్యర్థి చాలా శ్రమించాలి.