CWC 2023 Qualifiers ZIM vs SCO: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు జింబాబ్వే వేదికగా నిర్వహిస్తున్న క్వాలిఫయర్ పోటీలలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇదివరకే రెండుసార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ వెస్టిండీస్ లీగ్ దశలోనే క్వాలిఫై ఛాన్స్ కోల్పోయింది. తాజాగా జింబాబ్వే కూడా వరల్డ్ కప్ క్వాలిఫై రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫై టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ లు గెలిచిన జింబాబ్వే కీలకమైన సూపర్ సిక్సెస్ దశలో మాత్రం బోల్తా కొట్టింది.
షాకిచ్చిన స్కాట్లాండ్..
సూపర్ సిక్సెస్ లో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ తో బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే స్కాట్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ (48), మాథ్యూ క్రాస్ (38), బ్రాండన్ మెక్ కల్లమ్ (34) లు ఫర్వాలేదనిపించారు. అనంతరం 235 పరుగుల ఛేదనలో జింబాబ్వే.. 41.1 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ ర్యాన్ బర్ల్ (83), వెస్లీ మధెవెరె (40) విజయం కోసం ఆఖరిదాకా పోరాడారు.
ఈ టోర్నీ ఆసాంతం రాణించిన క్రెయిగ్ ఎర్విన్ (2), సీన్ విలియమ్స్ (12) తో పాటు సికందర్ రజా (34) లు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో జింబాబ్వే వన్డే వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించింది. సూపర్ సిక్సెస్ లో ఆ జట్టు తొలి మ్యాచ్ లో ఓమన్ ను ఓడించినా తర్వాత శ్రీలంక, స్కాట్లాండ్ చేతిలో ఓడి నిరాశగా వెనుదిరిగింది. గత వన్డే ప్రపంచకప్ అర్హత పోటీలలో కూడా జింబాబ్వే.. యూఏఈతో మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో వరల్డ్ కప్ అర్హత కోల్పోయిన జింబాబ్వే, తాజాగా స్కాట్లాండ్ చేతిలో ఓడటం గమనార్హం.
లంకకు కన్ఫర్మ్.. ఒక్క స్థానం కోసం ఆ రెండింటి మధ్య పోటీ..
జింబాబ్వే కూడా నిష్క్రమించడంతో వన్డే వరల్డ్ కప్ క్వాలిఫై రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచిన లంక.. క్వాలిఫయర్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మిగిలిన స్థానం కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్కాట్లాండ్ సూపర్ సిక్సెస్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో రెండు గెలిచింది. నెదర్లాండ్స్ రెండు ఆడి ఒకటి గెలిచింది. పాయింట్ల పరంగా స్కాట్లాండ్ (6), నెదర్లాండ్స్ (4) కంటే బెటర్ గానే ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కూడా స్కాట్లాండ్.. డచ్ టీమ్ కంటే మెరుగ్గా ఉంది. ఈ రెండు జట్ల మధ్య రేపు (జులై 6న) మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ గెలిస్తే రెండో స్థానంతో రెండో క్వాలిఫయర్ గా వరల్డ్ కప్ ఆడనుంది. కానీ నెదర్లాండ్స్ గెలవడమే కాదు.. స్కాట్లాండ్ ను భారీతేడాతో ఓడిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుని వరల్డ్ కప్ లో అర్హత సాధించే ఛాన్సెస్ ఉంటాయి.