Cricketer Shikhar Dhawan: టీమ్‌ఇండియా క్రికెటర్‌ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. దిల్లీలోని ఓ కుటుంబ న్యాయస్థానం అతడి సతీమణి అయేషాతో విడిపోయేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు అనుమతి ఇచ్చింది.


జీవిత భాగస్వామిని మానసికంగా వేధించడం, మానసిక క్రూరత్వం కోణంలో కోర్టు శిఖర్‌ ధావన్‌కు విడాకులు మంజూరు చేసింది. అతడి ఆరోపణలను ఆయేషా సవాల్‌ చేయకపోవడంతో కోర్టు వాటిని అంగీకరించింది. 2020, ఆగస్టు నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా జీవిస్తుండటంతో వీరి వివాహ బంధం ఎప్పుడో చచ్చిపోయిందని న్యాయమూర్తి హరీశ్‌ కుమార్‌ అన్నారు.


'ఈ అంశంపై ప్రతివాది కనీసం సవాల్‌ చేయలేదు. వివాహ బంధంలో తప్పు ఆమెదే అవుతుందని తెలిసినా ఊరుకుంది. ఆస్ట్రేలియా కోర్టు నుంచి ఆమెకు అనుకూలంగా ఆర్డర్స్‌ తెచ్చుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదని భావించింది' అని జస్టిస్‌ హరీశ్‌ కుమార్‌ తెలిపారు.


శిఖర్‌ ధావన్‌, అయేషా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఆమె మొదటి నుంచీ ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చి తనతో జీవిస్తానని చెప్పినట్టు ధావన్‌ కోర్టుకు వివరించారు. ఇద్దరు పిల్లల సంరక్షణ తీసుకొని ఆసీస్‌లోనే ఉంటానని మాజీ భర్తకు మాటివ్వడంతో అక్కడే ఉంటున్నారు. ఇక ధావన్‌కు జన్మించిన కొడుకూ ఆమెతోనే ఉండటం గమనార్హం.


'పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చి జీవిస్తానని చెప్పిన ప్రతివాది మాట తప్పారు. దాంతో పిటిషనర్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ మ్యారేజీతో బాధపడుతున్నారు. వేర్వేరుగా జీవించలేక, ఏళ్ల తరబడి తన సొంత కొడుకుకు దూరమై నిర్వేదానికి గురయ్యారు' అని కోర్టు తెలిపింది. ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు స్థిరాస్తులకు సహ యజమానిగా చేయాలని అయేషా ఒత్తిడి చేసిందన్న ధావన్‌ ఆరోపణలను కోర్టు అంగీకరించింది. 


మానసిక క్రూరత్వం కింద కోర్టు ధావన్‌కు విడాకులు ఇచ్చింది. అలాగే ఆస్ట్రేలియాలో కొడుకును చూసేందుకు అనుమతి ఇచ్చింది. కుమారుడి కస్టడీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతివాది ఆస్ట్రేలియాలో జీవిస్తుండటం, అది భారత న్యాయ పరిధిలోకి రావడంతో కస్టడీపై ఆర్డర్‌ ఇవ్వడం లేదని తెలిపింది.


'పిటిషనర్‌ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వ్యక్తి. అందుకే ఆస్ట్రేలియాతో మాట్లాడి కుమారుడిని చూసేందుకు, కస్టడీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కుమారుడితో నిత్యం మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం' అని కోర్టు వెల్లడించింది.