భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసం కొనసాగుతోంది. మొదట భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం... తర్వాత ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కూల్చేసి ఘన విజయం సాధించడం ప్రొటీస్‌కు అలవాటుగా మారింది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడిన ప్రొటీస్‌... నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ పాక్‌కు చావో రేవో తేల్చే మ్యాచ్‌ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా సారధి టెంబా బవుమా... పాకిస్థాన్‌కు హెచ్చరికలు పంపి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తాము తొలుత బ్యాటింగ్‌కు దిగితే ఊచకోత తప్పదని పాక్‌ జట్టును హెచ్చరించాడు. తమకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే 350కుపైగా పరుగులు చేస్తామని బవుమా తేల్చి చెప్పాడు.

 

పాక్‌ బౌలర్లకు హెచ్చరిక

చెన్నై పిచ్‌పై పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్లు బవుమా తెలిపాడు. తాము అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూశామని, లైట్ల కింద తొలుత బ్యాటింగ్‌ చేయడమే మంచిదని తాము భావిస్తున్నట్లు దక్షిణాఫ్రికా సారధి తెలిపాడు. సహజంగానే తాము మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా చాలా విజయాలు సాధించామని గుర్తుంచుకోవాలని బవుమా అన్నాడు. అదృష్టవశాత్తూ తాము టాస్‌ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉందన్నాడు. కానీ ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీల్లో రెండోసారి కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. తాము దానికి కూడా సిద్ధంగా ఉన్నామని బవుమా తెలిపాడు. తమకు తొలుత బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే మాత్రం 350కు పైగా పరుగులు చేస్తామని పాక్ బౌలర్లకు దక్షిణాఫ్రికా కెప్టెన్ వార్నింగ్‌ ఇచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 399/7 , బంగ్లాదేశ్‌పై 382/5 స్కోర్ చేసింది. ఇంగ్లండ్‌పై 229 పరుగుల తేడాతో, బంగ్లాదేశ్‌పై 149 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ మాత్రం గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. 

 

కానీ చెన్నైలోని చిదంబరం స్టేడియంలోని పిచ్‌ స్లోగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావడం కొంచెం కష్టమే. కానీ తమ ప్రణాళికలు తమకున్నాయని.. భారీ స్కోరు సాధిస్తామని బవుమా తెలిపాడు. తమ ప్లేయింగ్‌ లెవన్‌లో మార్పులు ఉంటాయని బవుమా స్పష్టం చేశాడు. కానీ పిచ్‌ను పరిశీలించిన తర్వాతే తుది జట్టుపై ఓ నిర్ణయానికి వస్తామని తెలిపాడు. స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలను బవుమా కొట్టిపారేయలేదు. పాకిస్థాన్ అత్యుత్తమంగా ఆడడం లేదని ఒప్పుకున్న బవుమా... తాము మాత్రం పాక్‌ను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశాడు. 

 

తొలుత బ్యాటింగ్‌ అంటే చాలు దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లను ప్రొటీస్‌ బౌలర్లు ఊచకోత కోశారు. ఏకంగా 428 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. రెండో మ్యాచ్‌లో అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపైనా ప్రొటీస్‌ 311 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్‌ వరుసగా రెండో సెంచరీ చేశాడు. మూడో మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో భంగపడింది. మళ్లీ ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు మళ్లీ 399 పరుగులు చేసింది. అయిదో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ మరోసారి 382 పరుగులు నమోదు చేసింది.