T20 World Cup Batting Records: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)కు సమయం ఆసన్నమైంది. జూన్‌ 1 నుంచి అమెరికా, విండీస్ దీవుల్లో ధనా ధన్ అంటూ ఫోర్లు, సిక్సర్ల మోత మోగిపోతుంది. ఐపీఎల్(IPL 2024) ముగిసిన వెంటనే మరో మెగాటోర్నీ జరగడం క్రికెట్ అభిమానులకు నిజంగా పండగే. మరి పొట్టి ప్రపంచకప్‌ అంటే వేగంగా పరుగులు సాధించడం. మరి టీ20 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌ రికార్డుల గురించి ఒసారి తెలుసుకోవాల్సిందే.


పరుగుల రారాజు కోహ్లీ


ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో రికార్డుల రారాజు మన విరాట్ కోహ్లీ(Virat Kohli)నే. టీ 20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. 5 ఎడిషన్లలో మొత్తం 1141 పరుగులు చేశాడు. 2014 ఎడిషన్‌లో కోహ్లీ కేవలం ఆరు మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేశాడు. 14 అర్ధ సెంచరీలతో అందరికంటే ముందు వరుసలో నిలిచాడు. వయసురీత్యా.. వచ్చే టీ20 ప్రపంచ కప్‌ను కోహ్లీ ఆడటం దాదాపు అసాధ్యమే. కాబట్టి ఈ సీజన్‌లో మరిన్ని రికార్డులు కింగ్ కన్నేశాడు.


విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (Chris Gayle) ప్రస్తుతం క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ  టీ20 ప్రపంచకప్‌లో అతడి రికార్డులు ఇంకా చెక్కుచెదరలేదు. టీ 20 ప్రపంచ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిటే ఉంది. టీ20 ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్లో కేవలం 50 బంతుల్లో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. మొత్తం టీ20 ప్రపంచకప్‌లో రెండు శతకాలు సాధించిన గేల్ రికార్డును ఇంకా ఎవరు బద్దలు కొట్టలేదు. గేల్‌ 9 అర్థశతకాలు సాధించాడు.  


 హిట్ మ్యాన్ రికార్డ్
టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకూ 39 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ(Rohit Sharma) టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలిచాడు. షకీబ్ అల్ హసన్ 36 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. 2007లో టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభమైనప్పటి నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రతి ఎడిషన్‌లో ఆడిన ఏకైక భారత క్రికెటర్‌ మన హిట్‌ మ్యానే. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ 9 అర్థశతకాలు సాధించాడు. కానీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఆయన ఫ్యాన్స్‌కు నిరాశ మిగులుస్తోంది. ఈ టోర్నీలో ఆ ముచ్చట హిట్‌ మ్యాన్ తీర్చేస్తాడన్న ఆశతో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు.  


మహేళ జయవర్ధనే క్రికెట్‌ నుంచి రిటైర్ అయినప్పటికీ.. టీ20 ప్రపంచకప్‌లో  శ్రీలంక తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా అతడి పేరిట రికార్డు 
ఉంది. అతను తన టీ 20 ప్రపంచ కప్ కెరీర్లో 1016 పరుగులు సాధించాడు. ఒక శతకం, ఆరు అర్థశతకాలతో రాణించాడు. టీ 20 ప్రపంచ కప్‌లో అసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2021 టోర్నమెంట్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత కెక్కాడు. 2021లో మొత్తం 289 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మొదటి టీ20ప్రపంచకప్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. వార్నర్‌ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం ఆరు అర్థశతకాలు సాధించాడు. హిట్టరే అయినా అతడు కూడా సెంచరీ చేయలేదు. కేఎల్‌ రాహుల్ 2021-22 సీజన్‌లో మాత్రమే పొట్టి ప్రపంచకప్ ఆడాడు. 11 ఇన్నింగ్స్‌లలో 322 పరుగులు చేశాడు. ఐదు అర్థశతకాలు సాధించాడు.