Champions Trophy In Pakistan: భారత్‌-పాక్(India vs Pakistan) మధ్య కొన్నేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత్‌ పాక్‌ వెళ్లి చాలా ఏళ్లు గడిచిపోయింది. ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్‌లలో మాత్రమే ఆడుతున్నాయి. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనూ పాకిస్థాన్‌ ఆడింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఆ దేశానికి వెళ్లాలా వద్దా అన్నది భారత్‌ ఇష్టమని ఐసీసీ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని తాము బీసీసీఐని ఎప్పుడూ అడగమని ఐసీసీ తేల్చి చెప్పింది. 2008 ముంబై దాడుల తర్వాత భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. ఐసీసీ సమావేశాల్లో పాకిస్థాన్‌ ఎంతగా ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. ద్వైపాక్షిక సిరీస్‌లు సహా ఏ టోర్నీ కోసం భారత్‌ ఆ దేశానికి వెళ్లట్లేదు. అయితే వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy In Pakistan) కోసం భారత జట్టును ఎలాగైనా తమ దేశానికి రప్పించాలని పాకిస్థాన్‌ చూస్తుండగా.. ఈ విషయంలో భారత్‌పై ఒత్తిడి తేలేమని ఐసీసీ తేల్చేసింది.


మహా సంగ్రామం జూన్‌ 9న
క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్‌ వచ్చేసింది. జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. 



పాక్ క్రికెటర్‌ ఏమన్నాడంటే..? 
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఇర్పాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్‌ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్‌ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్‌ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వ‌ర‌ల్డ్‌క‌ప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అంద‌రికి గుర్తే. 765 ప‌రుగులు సాధించి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్ గా రికార్డ్ సాధించాడు. దాద‌పు 95 యావ‌రేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కాడు.