WPL 2024 RCB Beat MI by 5 Runs to Seal Spot in Final: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL)లో బెంగళూరు( Royal Challengers Bangalore) అదరగొట్టింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమష్టి ప్రదర్శనతో తక్కువ పరుగులను కాపాడుకుని బలమైన ముంబైని బెంగళూరు మట్టికరిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. ఎలీస్‌ పెర్రీ అర్ధ శతకంతో తొలుత 135 పరుగులు చేసిన బెంగళూరు... ముంబైను 130 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... ఢిల్లీ క్యాపిటల్స్‌తో టైటిల్‌ పోరులో తలపడనుంది.

 

లో స్కోరింగ్‌ మ్యాచ్‌...

ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ముంబై బౌలర్ల ధాటికి బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సోఫీ డివైన్‌ 10, కెప్టెన్‌ స్మృతి మంధాన 10, దిశా 0 పరుగులకే పెవిలియన్‌ చేరారు. కానీ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఫెర్రీ మరోసారి బెంగళూరును ఆదుకుంది. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన పెర్రీ.. స్కోరింగ్‌ రేట్‌ మరీ పడిపోకుండా చూసింది. పెర్రీ 40 బంతుల్లో అర్ధసెంచరీ అందుకుంది. ఆఖరి ఓవర్లో ఆమె ఔటైనా.. చివరి బంతికి సిక్స్‌ బాదిన జార్జియా స్కోరు 130 దాటించింది. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌ సీవర్‌, సైకా ఇషాక్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.  

 

స్వల్ప లక్ష్య ఛేదనలో కష్టాలు

భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌.. 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఛేదనలో ముంబై ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ముంబై బ్యాటర్లకు... బెంగళూరు బౌలర్లు కళ్లెం వేశారు. హేలీ 15 పరుగులకే వెనుదిరిగింది. ముంబై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్యానికి 68 పరుగులు చేసి సునాయసంగా గెలిచేలా కనిపించింది. పెర్రీ వేసిన 16వ ఓవర్లో హర్మన్‌ రెండు బౌండరీలు బాదడంతో సమీకరణం 24 బంతుల్లో 32గా మారింది. ముంబై విజయం ఖాయం అనుకున్న స్థితిలో వరుస ఓవర్లలో హర్మన్‌, సజన ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ముంబై 13 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్మన్‌ప్రీత్‌ను ఔట్‌ చేసి ఓ చిన్న అవకాశం సృష్టించుకున్న బెంగళూరు.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసి 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆశ వేసిన ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా తొలి 3 బంతులకు 4 పరుగులే వచ్చాయి. నాలుగో బంతికి పూజ స్టంపౌట్‌ అయింది. ఆ తర్వాతి రెండు బంతులకు రెండే పరుగులు రావడంతో బెంగళూరు విజయం సాధించింది. ఆదివారం వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ టైటిల్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ను బెంగళూరు ఢీకొట్టనుంది.