Border Gavaskar Trophy:  ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. వివాహం తర్వాత తొలిసారి ఈ జంట కలిసి ఆలయానికి వెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన బాబా మహాకాల్ ఉజ్జయిని భస్మ హారతికి హాజరయ్యారు. అలాగే అక్కడి లింగానికి అభిషేకం చేశారు. స్వామి దర్శనం పూర్తయ్యాక రాహుల్- అతియాలు నంది హాలులో కూర్చుని ధ్యానం చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణం అంతా తిరిగారు. 






పేలవ ఫాంలో రాహుల్


కొన్నేళ్లుగా ప్రేమించుకున్న భారత క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టిలు ఇటీవలే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక క్రికెట్ విషయానికొస్తే ప్రస్తుతం రాహుల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. కొన్నాళ్లుగా టెస్ట్ క్రికెట్ లో పేలవ ప్రదర్శన చేస్తున్న ఈ ఓపెనర్.. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ విఫలమవుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచాడు. ఈ క్రమంలో తర్వాతి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఉన్నప్పటికీ.. వైస్ కెప్టెన్సీ పదవిని కోల్పోయాడు. పేలవ ఫాంలో ఉన్న రాహుల్ కు బదులు మూడో టెస్టులో శుభ్ మన్ గిల్ ను ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. 






బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యంలో ఉంది. తొలి 2 టెస్టులను గెలుచుకుంది. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభం కానుంది.