Sourav Ganguly: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన 2 టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ రెండు టెస్టులు 3 రోజుల్లోనే ముగిశాయి. భారత స్పిన్ బౌలింగ్ ముందు ఆసీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వలన ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చేతిలో ఆస్ట్రేలియా జట్టు వైట్ వాష్ అవుతుందని జోస్యం చెప్పారు. 


'నేను ఈ సిరీస్ లో 4-0 ను చూడబోతున్నాను. భారత్ ను ఓడించడం ఆస్ట్రేలియాకు కష్టమే. ఈ పరిస్థితుల్లో మాది చాలా ఉన్నతమైన జట్టు' అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక మొదటి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియాపై ఆ జట్టు మాజీలు విరుచుకుపడుతున్నారు. 






మొదటి బంతి కూడా పడకముందే..


ఆస్ట్రేలియన్ గ్రేట్ గ్రెగ్ చాపెల్ ఆసీస్ ప్రదర్శనను నిందించాడు. మొదటి బంతి కూడా పడకముందే వారు ఓటమిని అంగీకరిస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. చాపెల్ మాట్లాడుతూ.. 'బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులు చూశా. తొలి బంతి పడడానికి ముందే ఆసీస్ జట్టు దెబ్బతింది. సిరీస్ గెలవాలంటే ఆస్ట్రేలియా తన బలానికి తగినట్లు ఆడాలి. తప్పుడు అంచనాల ఆధారంగా ప్రణాళిక రచిస్తే ఉపయోగముండదు. అత్యుత్తమ బౌలర్లను జట్టులోకి తీసుకోవాలి. స్పిన్ పిచ్ లపై స్వీప్ షాట్లు ఆడడం మంచిదే కానీ ఇలాంటి పిచ్ లపై రిస్క్ తక్కువగా ఉండే ఇతర షాట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆస్ట్రేలియా ఆడి ఉండాల్సింది.' అని చాపెల్ అన్నాడు.


ఔటవ్వడానికే ప్రాక్టీస్: హర్భజన్


భారత్ లో పర్యటిస్తున్న ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టుపై హర్భజన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా జట్టు రవిచంద్రన్ అశ్విన్ డూప్లికేట్ తో ప్రాక్టీస్ చేసింది. వాస్తవానికి ఇప్పడున్న ఆసీస్ జట్టు డూప్లికేట్ అని నేను భావిస్తున్నాను. వారు ప్రతికూల విషయాలపై దృష్టిసారిస్తున్నారు. వారి ఆలోచనా విధానం నెగెటివ్ గా ఉంది. వారి గందరగోళంతో సిరీస్ లో మొదటి బంతి పడకముందే ఓటమి పాలయినట్లు కనిపించింది. ఈ పర్యటన కోసం వారు ఎలాంటి సన్నద్ధత చేసినట్లు అనిపించడంలేదు. వారి ప్రదర్శన చూస్తుంటే అవుటవ్వడానికే ప్రాక్టీస్ చేసినట్లు కనిపిస్తోంది.' అంటూ హర్భజన్ విమర్శించాడు.