Zimbabwe Squad For T20 Series Vs India: జింబాబ్వే(Zimbabwe) పర్యటనకు భారత యువ జట్టు బయల్దేరింది. మరోవైపు యువ టీమిండియా(India)పై సత్తా చాటేందుకు జింబాబ్వే కూడా సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు జింబాబ్వేకు చెందిన ఓ ప్లేయర్‌పై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఇంకా పౌరసత్వం కూడా రాకుండా ఓ ప్లేయర్‌.. జింబాబ్వే జట్టుకు ఎంపికయ్యాడు. ఈ ఘటన క్రికెట్‌ ప్రపంచానికి ఆసక్తి కలిగించింది. అసలు ఎవరా ప్లేయర్‌..? ఎక్కడినుంచి వచ్చాడు..? జింబాబ్వే జట్టులో ఎలా స్థానం దక్కించుకున్నాడు అన్న విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆ ప్లేయర్‌ జింబాబ్వే దేశవాళీలో బ్యాట్‌ ఝుళిపించి.. ఇక భారత్‌పై అరంగేట్రం చేసేందుకు సిద్ధమైపోయాడు. ఆ క్రికెటర్‌ ఎవరో... ఎక్కడినుంచి వచ్చాడో మనమూ తెలుసుకుందామా...
 



జట్టులో అంటుమ్ నఖ్వీ

భారత్‌తో టీ 20 సిరీస్‌ కోసం జింబాబ్వే జట్టును ప్రకటించగానే అందరి దృష్టి ఒక ఆటగాడిపై పడింది. అతనే అంటుమ్‌ నఖ్వీ(Antum Naqvi). సికిందర్‌ రజా(Sikandar Raza) నేతృత్వంలో జింబాబ్వే క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో జింబాబ్వే జట్టుకు చెందిన అంటుమ్‌ నఖ్వీపై జోరుగా చర్చ జరుగుతోంది. జింబాబ్వే జట్టులో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక కచ్చితంగా అంటుమ్ నఖ్వీనే. 25 ఏళ్ల అంటుమ్‌ నఖ్వీ బ్యాటర్‌గా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జింబాబ్వే దేశవాళీలో పరుగుల వరద పారించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించి రికార్డు సృష్టించాడు. అంటుమ్ నఖ్వీ బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జన్మించాడు. నఖ్వీ తల్లిదండ్రులు పాకిస్థాన్‌కు చెందినవారు. నఖ్వీ జన్మించకముందే వారు బెల్జియంలో సెటిలయ్యారు. అక్కడే 1999లో నఖ్వీ జన్మించాడు. తర్వాత నఖ్వీ ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాలనే ఆసక్తితో నఖ్వీ అక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈలోపే జింబాబ్వే వెళ్లి అక్కడ దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. దేశవాళీలో నఖ్వీ పరుగుల వరద పారిస్తుండడంతో జింబాబ్వే జాతీయ జట్టు నుంచి అతనికి పిలుపు వచ్చింది. అంటుమ్‌ నఖ్వీకి పౌరసత్వం ఇవ్వడంపై జింబాబ్వే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే... జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపికై నఖ్వీ సంచలనం సృష్టించాడు. దేశవాళీ క్రికెట్‌లో మిడ్ వెస్ట్ రైనోస్ తరఫున ఆడుతున్న నఖ్వీ టీ20 ఫార్మాట్‌లో 146.80 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నఖ్వీ సగటు 72.00. లిస్ట్ A క్రికెట్‌లో సగటు 73.42గా ఉంది. మిడ్ వెస్ట్ రైనోస్‌కు అంతుమ్ నఖ్వీ కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. 

 

షెడ్యూల్‌ ఇలా

భారత్- జింబాబ్వే మధ్య అయిదు మ్యాచుల  టీ20 సిరీస్‌ జరగనుంది. తొలి టీ 20 జూలై 6న జరగనుంది. రెండో టీ20 మ్యాచ్ జులై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో మ్యాచ్ జూలై 14న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లోనే అన్ని మ్యాచులు జరుగుతాయి.